కరీంనగర్ కమాన్ చౌరస్తా, నవంబర్ 21 : కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న గుడిపై ఆశలు చిగురించాయి. వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అట్టహాసంగా భూమిపూజ పూర్తయి, నిర్మాణం మొదలయ్యే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో మళ్లీ భుజాన వేసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. గుడి నిర్మాణం కోసం కదిలారు. అందులో భాగంగానే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్, కోరుట్ల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ, 10 ఎకరాల భూమి కేటాయింపు, అలాగే టీడీడీ బోర్డు 20 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్మాణం చేపట్టాలని కోరారు. అందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. దీనికి చైర్మన్ స్పందించి దేవస్థానం నిర్మాణం వెంటనే చేపడుతామని చెప్పారని గంగుల తెలిపారు. ప్రథమ ప్రాధాన్యత కింద తీసుకుంటామని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వివరించారు.
కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం చేరువ చేయాలని బీఆర్ఎస్ ప్రభత్వంలో సంకల్పించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్లో పదెకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇతర బీఆర్ఎస్ నాయకుల కృషితో 2023 మే 31న వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిపారు. అదే ప్రాంగణంలో సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. అప్పుడు ఆనాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతులమీదుగా నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. 20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మళ్లీ ఎమ్మెల్యే కమలాకరే భుజాన ఎత్తుకున్నారు. ఇటీవలే కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడిని హైదరాబాద్‌లో కలిసి ఆలయం నిర్మించాలని కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు.