కాంగ్రెస్ కపట నాటకం బయటపడింది. ఆ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండదన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికారికంగా 42 శాతం అమలు చేస్తామని చెప్పి, ప్రస్తుతం మాటమార్చిన తీరే అందుకు అద్దం పడుతున్నది. అలవి కానీ హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఒక్కో హామీపై ఒక్కో పేచీ పెడుతూ వస్తున్న రేవంత్ సర్కారు.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కూడా అదే విధానాన్ని వర్తింప జేసింది. పార్టీ పరంగా కల్పిస్తామే తప్ప అధికారికంగా పంచాయతీల్లో అమలు చేయడం సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టడమే కాదు, ఇప్పుడా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. నిజానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయదని, దానికి అనేక అడ్డంకులున్నాయని, చివరికి రేవంత్ ప్రభుత్వం వాటినే సాకుగా చూపుతూ తప్పించుకుంటుందన్న వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ గత జూన్24న “బీసీలకు మొండి ‘చెయ్యే’!” శీర్షికన కథనం ప్రచురించింది. ఇప్పుడదే నిజమైంది! బీసీలకు రిక్త‘హస్తం’ చూపుతూ.. సర్కారు పూటకో మాట చెబుతున్న తీరుపై బీసీ సంఘాల నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతరేసి కొత్త పాటపాడుతుండడంపై మండిపడుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాగైనా ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించింది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ వర్గాలను నమ్మించేందుకు అంకెల గారడీని ప్రదర్శించింది. 42 శాతానికి రిజర్వేషన్ పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, బీసీ వర్గాల్లో ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది. అందుకు బీసీ కులగణన చేయాల్సిన అవసరముందని, ఇంటింటా సర్వే చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతూ వచ్చింది. ప్రస్తుతం సర్వే పూర్తయింది. వివరాలు కూడా బహిర్గతమైన నేపథ్యంలో ప్రభుత్వం రూటు మార్చింది.
ఇన్నాళ్లూ సర్వే పూర్తయిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతూ వచ్చిన రేవంత్ సర్కారు, ఇప్పుడు ఏకంగా మాట మార్చింది. సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. ఇది సాధ్యం కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, దీనికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెబుతున్నది. అక్కడితో ఆగకుండా దీనిని కప్పిపుచ్చుకునేందుకు పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతున్నది. అయితే అధికారంలోకి రాక ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌లో గానీ, అధికారంలోకి వచ్చిన 14నెలల్లో గానీ ఈ మాటలను సర్కారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు మాత్రం తన తప్పును దాచి పెట్టుకోవడానికి, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి మేనిఫెస్టోలో ఒక హామీని చేర్చేముందే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్న పరిస్థితులు, రిజర్వేషన్ల అమలు, సుప్రీంకోర్టు తీర్పుల వంటి వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. నాటి నుంచి రెండు రోజుల క్రితం వరకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతూ వచ్చిన రేవంత్సర్కారు, ఇప్పుడు మాట మార్చడంపై ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదని ముందుగానే గత బీసీ కమిషన్ చెప్పినట్టు సమాచారం బయటకు వచ్చింది. అనధికారికంగా కూడా ఓ నివేదికను సమర్పించినట్టు తెలిసింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించడానికి వీలు లేదని, అందులోనూ రాజ్యాంగంలోని 243డీ అధికరణం ప్రకారం.. ఎస్సీలు, ఎస్టీలకు ఈ 50 శాతంలో ఆయా ప్రాంతాల్లో ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు అనుగుణంగా సంబంధితవర్గాలకు ముందుగా రిజర్వేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే బీసీలకు ఇవ్వాలని కమిషన్ గతంలోనే సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నిజానికి 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఏ పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో ఖరారు చేశారు. దాని ప్రకారం చూస్తే బీసీలకు 22.79 శాతం, అలాగే ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించి, ఈ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. వీటన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి చూస్తే.. ఏ పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయ్యే అవకాశాలే కనిపించడం లేదని, బీసీ డిక్లరేషన్ ఒక రిక్తహస్తంగానే మారే అవకాశాలున్నాయని జూన్ 24న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే జరుగుతున్నది. కాగా, ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లు ఆశలు రేపి, ఇప్పుడు మాత్రం పార్టీ పరంగా అమలు చేస్తామని చేతులెత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బీసీ జనాభాను తక్కువగా అగ్ర కులాల జనాభాను ఎక్కువ చేసి చూపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రకు నిదర్శనం. కుల గణన చేస్తామని, ఆ ప్రకారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించింది. కుల గణనలోనే బీసీలకు అన్యాయం చేసింది. ఇదంతా ఫేక్ సర్వే. సర్వే పూర్తి స్థాయిలో జరగలేదా..? జరిగిన సర్వేలో కులాల సంఖ్యను తగ్గించారా..? అనేది బయట పడాలి. ఈ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద కుట్రగా మేం భావిస్తున్నాం. సర్వేలో ఎక్కడా క్లారిటీ లేదు. కులాల వారీగా విడుదల చేసిన జాబితాలో కూడా అన్ని తప్పుడు లెక్కలే కనిపిస్తున్నాయి. తక్కువ ఉన్న కులాన్ని ఎక్కువగా, ఎక్కువ ఉన్న కులాన్ని తక్కువగా చేసి చూపుతున్నారు. ఈ సర్వే వాస్తవానికి పూర్తిగా విరుద్దంగా ఉంది. దీనిని రద్దు చేసి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికా బద్ధంగా సర్వే నిర్వహించి ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్ధ్దంగా కల్పించాలన్నదే మా బీసీ సంఘాల ప్రధాన డిమాండ్. లేదంటే బీసీలు ఐక్య ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పక తప్పదు.
కులగణన సర్వే ఫలితాల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. బీసీ జనాభా తగ్గించి చూపడంపై తక్షణమే సమగ్ర సమీక్ష జరపాలి. గతంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా 52 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది. ప్రస్తుత కుల గణనలో బీసీల జనాభా 46.25 శాతం చూపించడం ఏమిటి? ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల జనాభా పెరుగుతుంటే.. బీసీ జనాభా శాతం మాత్రం తగ్గినట్టు చూపించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. 2011 తెలంగాణ లెకల ప్రకారం రాష్ట్ర జనాభా 3.7 కోట్లుగా ఉంటే, సర్వేలో 3.54 కోట్ల మందిగా లెకించారు. 2011 సెన్సెస్ ప్రకారం తెలంగాణ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ 13.5 శాతం. గత లెకల ప్రకారం బీసీ జనాభా సుమారు కోటి 84 లక్షలు, తెలంగాణ యావరేజ్ గ్రోత్ రేటు 13శాతం. ఆ లెకన సుమారుగా 36లక్షల జనాభా పెరిగి 2కోట్ల 20లక్షల బీసీ కుటుంబాల లెకలు రావాలి. కానీ, కావాలని తప్పుడు లెకలు చూపించి బీసీ జనాభాను కోటి 64 లక్షలకు తగ్గించి చూపించారు. సర్వేలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసుల లెకలు తీయలేదు. గతంలో ఓసీల జనాభా 10శాతం లోపే అని చెబుతుండగా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కాపాడుకునేందుకు ఇప్పుడు 15.79శాతంగా చూపించారనే అనుమానాలు కలుగుతున్నాయి. 10శాతం కంటే తకువ ఉన్న ఓసీలు 15 శాతానికి పెరిగితే, బీసీల జనాభా శాతం మాత్రం పెరగకుండా ఎలా ఉంటుంది? ఈ సర్వే ఫలితాలను తక్షణమే సమీక్షించి, పూర్తి పారదర్శకతతో నిజమైన గణాంకాలను వెల్లడించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త బీసీ ఉద్యమం తప్పదు.
బీసీ కులగణన అనేది తప్పుల తడక. ఇంతకు ముందు చేసిన సర్వేలో ఎక్కువ వచ్చి, ఇపుడు తక్కువ రావడం ఏమిటి? 2014లో చేసిన సర్వేలో బీసీ కులాలు 51 శాతం ఉన్నట్టు తేలగా, 2024లో చేసిన సర్వేలో 46 శాతం ఎలా వస్తుంది? కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ బీసీలను మోసం చేస్తున్నది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడేందుకు అగ్రకుల జనాభాను పెంచి చూపడంలో పెద్ద కుట్ర జరిగింది. మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు. ఈ విషయమై బీసీలందరినీ చైతన్య పరుస్తాం. బీసీ సబ్ కమిటీలో బీసీ మంత్రులు ఉంటే బాగుండేది. అగ్ర కులానికి చెందిన ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడే మాకు అనేక అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమానాలు బలపడుతున్నాయి. బీసీలను అణచివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతున్నది. బీసీల జనాభా ఎంతన్నది ముందు తేలిన తర్వాతనే రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. లేదంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు.
జనాభా పరంగా దేశంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు దకాలంటే సమగ్ర కులగణన సర్వే జాతీయ స్థాయిలో అవసరం. భవిష్యత్తులో నిర్వహించే జనాభా గణనలో కులగణనను కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని మా టీబీసీ జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే కేంద్రం ఆమోదిస్తేనే అమలవుతుంది. 42 శాతం కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాలి. నివేదికకే పరిమితం కాకుండా అభివృద్ధి ఫలాలు క్షేత్ర స్థాయిలో అమలు చేసి బీసీ వర్గాలకు న్యాయం చేయాలి.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక తప్పుల తడకగా ఉంది. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం ఉండగా, పదేండ్ల తర్వాత బీసీ జనాభాను 46 శాతంగా చేపి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. 7 శాతంగా ఉన్న అగ్ర కుల జనాభాను మాత్రం 15 శాతంగా చూపించి, బీసీలపై కుట్ర చేస్తున్నరు. బీసీల జనాభా తగ్గించడం కాంగ్రెస్ కుట్రలో ఒక భాగమే. బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర చేస్తున్నరు. ప్రస్తుత సర్వే ఫలితాలను పూర్తిగా సమీక్షించి నిజమైన గణాంకాలను వెల్లడించాలి. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనకు సంబంధించి నివేదికలు సమర్పించి చేతులు దులుపుకొన్నారు. అసలు నివేదికలు కాదు, పకడ్బందీ చట్టం తేవాలి. గత కేసీఆర్ ప్రభుత్వ లెక్కలకు ఈ ప్రభుత్వ లెక్కలకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. బీసీల సంఖ్య తగ్గించి చూపడం అన్యాయం.
కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన సర్వే నివేదిక తప్పుల తడక. 56 శాతానికి పైగా ఉన్న బీసీలను 46.2 శాతంగా చూపిస్తారా? సర్వే పూర్తికాకుండానే లెకచెప్పడం వెనుక కుట్ర ఉన్నది. బీసీలకు రిజర్వేషన్ల పెంచాల్సి వస్తదని తూతూ మంత్రంగా సర్వే చేయడం బాధాకరం. మన రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీ కులసంఘాలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధం కావాలి. 42 శాతం కోటా ఇవ్వకుంటే రణరంగమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా, ఉద్యోగ రంగాల్లో 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలి. లేదంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతాం.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చీపుర్లతో కాంగ్రెస్ నాయకులకు సత్కారం చేస్తారని హెచ్చరించారు. సొంత పార్టీ నాయకులే రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని.. ఓ బఫూన్లా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రిపై లేనివిధంగా 70కి పైగా కేసులు రేవంత్‌పై ఉన్నాయని, చార్ బీస్ నంబర్ సైతం ఆయనను చూసి సిగ్గుపడుతున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్‌ను పొగుడుతున్నారంటే అంతటి గొప్ప నాయకుడు మరొకరు లేరని అభివర్ణించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిన సమయంలో మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా తన కుటుంబ వివరాలు చెప్తారా..? ఎవరైనా ఇంటికొచ్చి అడిగితే తన్ని పంపండి అని ఆనాడు రేవంత్‌రెడ్డి మాట్లాడాడని గుర్తుచేశారు.
ఆ రోజు విమర్శలు చేసిన ఆయన.. ఈ రోజు తలకాయ ఉండే కులగణన సర్వే చేశాడా..? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయం దినంగా గుర్తించాలని చెబుతున్నారని, తాము మాత్రం అవగాహన రాహిత్య దినంగా భావిస్తున్నామన్నారు. కామారెడ్డిలో జరిగిన సభలో 42శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలుచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్వే పేరిట ఏడాది కాలయాపన చేశారని మండిపడ్డారు. సర్వేపేరిట స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదేండ్ల క్రితం 60శాతం బీసీలుంటే తన సర్వేలో 10శాతం తగ్గించి చూపించారని ఆగ్రహించారు. రేవంత్‌కు మద్దతుగా కేంద్ర మంత్రులు డబ్బా కొడుతున్నారని విమర్శించారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ వర్గీకరణ కోసం జరిగిన పోరాటం అభినందనీయమని కొనియాడారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి అందజేసి.. వర్గీకరణ అమలు చేయాలని కోరారని గుర్తు చేశారు. మాదిగ రిజర్వేషన్లు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, గజభీంకార్ రాజన్న, గుజ్జుల రాజిరెడ్డి, జంగిటి అంజయ్య, అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.