డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు వేళయింది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మరో మూడు గ్రామా ల్లో నిర్మించిన 369 ఇండ్ల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. నేడు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా గృహప్రవేశాలు చేయించనుండగా, కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
గంభీరావుపేట, సెప్టెంబర్ 26: గూడు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల వసతులతో ఇంటిని నిర్మించి పేదలకు అందిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో 168, ఎస్సీ కాలనీలో 104, లింగన్నపేటలో 50, కోళ్లమద్దిలో 17, నర్మాలలో 30, మొత్తం 369 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఆయాచోట్ల సకల సౌకర్యాలు కల్పించింది. సువిశాలమైన గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇరువైపులా మొక్కలు, మిషన్ భగీరథ నల్లాలు, ఇంకుడు గుంతలతో గేటెడ్ కమ్యూనిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్వంగా సుందరంగా నిర్మించింది.
హర్షాతిరేకాలు
మంత్రి కేటీఆర్ బుధవారం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, పట్టాలు అందజేయనున్నారు. ఆ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామాల వారీగా అర్హులను గుర్తించి, ఇండ్లు కేటాయించారు. ఇన్నాళ్లూ నిలువ నీడ లేక కష్టాలు పడ్డ తమకు ప్రభుత్వం అత్యంత సుదరంగా బంగ్లాలను నిర్మించి అందిస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
జీవితంలో అనుకోలేదు
నాకు పెళ్లి అయినప్పటి నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నం. నా భర్త ఐదేళ్ల క్రితం ఆనారోగ్యంతో చనిపోయిండు. అప్పటి నుంచి నేను నా పిల్లల్ని పట్టుకోని కూలీపని చేసు కుంటూ కిరాయి ఇంట్లో బతుకుతున్న. ఈ పరిస్థితుల్లో నేను ఒక సొంత ఇంట్లో ఉంటానని జీవితంలో అనుకోలేదు. కేటీఆర్ సార్ దయతో నాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేను. కేటీఆర్ సారుకు రుణపడి ఉంటం. – మహ్మద్ ఆస్మా, కోళ్లమద్ది
సంతోషంగా ఉన్నది
ఏండ్లుగా కిరాయికి ఉంటున్న పేదలకు పక్కా ఇండ్లను అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఎన్నికల సమయం లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేర కు గంభీరావుపేట మండలంలో మొదటి విడుతగా 369 ఇండ్లను మంజూరు చేశారు. సకల హంగులతో నిర్మించారు. ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి అర్హులుగా నిర్ణయించి ఇండ్లను ఇప్పటికే కేటాయించారు. నేడు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకోబోతుండడం సంతోషంగా ఉంది.
– వంగ కరుణ, ఎంపీపీ (గంభీరావుపేట)
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
మంత్రి కేటీఆర్ సహకారంతో గంభీరావుపేట మండలం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం గా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇండ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తుండడం సంతోషంగా ఉంది. లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
– కొమిరిశెట్టి విజయ, జడ్పీటీసీ (గంభీరావుపేట)