Karimnagar | కాల్వ శ్రీరాంపూర్, జూన్ 3 : రైతులు నాణ్యమైన వరి విత్తనాలను ఎంపిక చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని కరీంనగర్ సీనియర్ శాస్త్రవేత్త విజయభాస్కర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం నుండి తయారు చేయబడిన వరి రకాలను ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున అభ్యుదయ రైతులను గుర్తించి వారికి నాణ్యమైన విత్తనాలు అందజేశారు.
నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి పంట దిగుబడిని సాధించి ఇతర రైతులకు విత్తనాన్ని పంపిణీ చేయడం వల్ల రైతులు నాణ్యమైన విత్తనాలు పొంది అధిక దిగుబడులు పొందేందుకు వీలుతోపాటు విత్తనాలపై చెల్లించే అధిక ఖర్చును నివారించవచ్చని అన్నారు. రైతులు ముందస్తు వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందడమే పాటు పకృతి వైఫరీత్యాలనుండి తట్టుకొని రైతు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు రోహిణి కార్తిలో వరి నార్లు పోసుకోవడం ద్వారా నార్లు బలంగా పెరిగి చిడపీడలను తట్టుకొని ముందుగా పంట చేతికి వస్తుందని వివరించారు. నవంబర్‌లోని అనురాధ కార్తిలో నార్లు పోసుకోవడం ద్వారా రైతులు పకృతి వైఫరీత్యాలనుండి వడగండ్ల వాన నుండి తప్పించుకొని అధిక దిగబడులు పండుటకు అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగార్జున ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు గా సదయ్య, మాదాసి సతీష్, ఆయా గ్రామాల రైతులు, ఏఈవోలు ఉన్నారు.