కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మూడు రోజులుగా తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 51.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు మత్తళ్లు పడుతున్నాయి. ఇక జిల్లాలోని మోయతుమ్మెద వాగు నుంచి నిన్నటి నుంచి వరద వస్తోంది. ఫలితంగా ఎల్ఎండీ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది. నిన్నటి కంటే ఈ రోజు కొంత ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులకుపైగా వరద వస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అక్కడక్కడా కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతినడం మినహా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగ లేదని అధికారులు చెబుతున్నారు. కాగా సోమవారం మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జమ్మికుంటలో అత్యధికం..
జిల్లాలో ఈ రోజు ఉదయం నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం జమ్మికుంటలో అత్యధికంగా 74.2, ఇల్లందకుంటలో 71.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గంగాధరలో 37.9, రామడుగులో 55.0, చొప్పదండిలో 62.6, కరీంనగర్ అర్బన్‌లో 48.8, కరీంనగర్ రూరల్‌లో 53.0, కొత్తపల్లిలో 41.2, గన్నేరువరంలో 40.0, మానకొండూర్‌లో 62.8, తిమ్మాపూర్‌లో 42.8, చిగురుమామిడిలో 32.1, సైదాపూర్‌లో 38.1, శంకరపట్నంలో 46.5, వీణవంకలో 64.5, హుజూరాబాద్‌లో 47.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా మొత్తంగా చూస్తే 51.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
పెద్దపల్లి: రంగంపల్లి చెరువు నుంచి వస్తున్న వరదలో చేపలు పడుతున్న మత్స్యకారులు
ఉప్పొంగుతున్న గోదావరి, మానేరు..
వర్షానికితోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉప్పొంగుతున్నది. ధర్మపురి, మంథని వద్ద గేట్లను ఆనుకొని ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లికి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అలాగే, మానేరు నదికి వరద పోటెత్తుతున్నది. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాలకుర్తి, అంతర్గాం, రామగుండం, మంథని మండలాల గోదావరి తీర గ్రామాల ప్రజలను, మానేరు, హుస్సేన్‌మియా వాగు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలోనూ మానేరు, మూలవాగు పరవళ్లు తొక్కుతున్నాయి.