తిమ్మాపూర్, అక్టోబర్30: మూడు, నాలుగు నెలలు కష్టపడి పెంచి పెద్ద చేసిన పొలాలు చేతికందే దశలో ఒక్క వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. రెండు మూడు రోజుల్లో వరి కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులను తుఫాను నిండా ముంచింది. బుధవారం రాత్రి తిమ్మాపూర్ మండలంలో (Thimmapur) కురిసిన భారీ వర్షంతో పొలాలు కింద పడిపోయి మడికట్లలో నీళ్లు నిలిచిపోయి గొలుసు మొత్తం వాలిపోయింది. ఎక్కడో చోట తప్ప దాదాపు అన్ని పొలాలు నెలవాలాయి.
పొలాలను ముంచిన ఉపగ్న వెంచర్..
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ శివారులో కుంట కింద ఏర్పాటు చేసిన వెంచర్ వల్ల రైతుల పంట పొలాలు నీట మునిగాయి. వెంచర్ ఏర్పాటు చేసిన తర్వాత కుంట మత్తడి వెళ్లేందుకు చిన్న మోరీ లాగా ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వచ్చిన వరద వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో సమీప పొలాలన్నీ మునిగిపోయాయి. దీంతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రాల్లో కష్టాలు..
వరి కోయని రైతుల పరిస్థితి ఒకలా ఉంటే కోసిన రైతుల కన్నీటి వ్యధ మరో తీరు ఉన్నది. అమ్ముకునేందుకు కళ్ళాల్లో పోసి ఆరబోసిన తరుణంలో వర్షం రావడంతో తడిసి ముద్దయిపోయాయి. వర్షం వస్తుందన్న సమాచారంతో రాశులుగా పోసినప్పటికీ భారీ వర్షానికి తడిసిపోయాయి. మరోవైపు కల్లాల నుంచి నీళ్లు బయటకు పోలేని పరిస్థితుల్లో పూర్తిగా నీటిమట్టమయ్యాయి.

రాకపోకులు బంద్..
భారీ వర్షాలకు కుంటలు, వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కల్వర్టులు ఉప్పొంగడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచి పోయారు. తిమ్మాపూర్ నుంచి పోరండ్ల, వచ్చునూర్ నుంచి జోగుండ్ల, పోలంపల్లి నుంచి మొగిలిపాలెం వెళ్లే రోడ్లలో వచ్చే వరద కల్వర్టుల వద్ద భారీగా వస్తున్నడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.