కరీంనగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. కుంటలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతుండగా, మత్తళ్లు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని చిలుక వాగు శనివారం రాత్రి నుంచే పొంగి పొర్లుతోంది. వాగు పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలోని వాగులో వరద ఉధృతంగా వస్తోంది. జగిత్యాల జిల్లాలో వర్షం దంచికొట్టింది.
కొడిమ్యాల మండలం పొతారం రిజర్వాయర్, కోనాపూర్‌లోని బంజరు చెరువు మత్తళ్లు దూకుతున్నాయి. కొడిమ్యాల నుండి సూరంపేట వెళ్లేదారిలో కోనాపూర్ శివారులో మాటుకుంట కట్ట కోతకు గురి కావడంతో కోరుట్ల నుంచి కరీంనగర్ వెళ్లే ఆర్టీసీ బస్సును అధికారులు నిలిపివేశారు. వేములవాడ మూలవాగు జలకళ సంతరించుకుంది. పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద చెక్ డ్యామ్ మత్తడి దూకగా తిప్పాపూర్‌కు వెళ్లేందుకు మూలవాగులో వేసిన రహదారి కొట్టుకుపోయింది.
కూలిన ఇండ్లు..
కోనరావుపేట మండలం మామిడిపల్లిలో పాముగారి రమేశ్‌కు చెందిన పెంకుటిల్లు తడిసిపోయి కూలిపోయింది. మల్లాపూర్ మండల కేంద్రంలో దామెర నరేశ్ ఇల్లు కూలిపోయింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేట(తెనుగుగూడెం)లో ఉండే వారి నివాసంలో కుం ట సమ్మక్క, సందీప అనే అక్కాచెల్లెళ్ల ఇల్లు కూలిపోయింది.
గోదారి ఉధృతి.. ప్రాజెక్టులకు వరద
ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతి పెరిగింది. గోదావరి ద్వారా 27,981క్యూసెక్కులు, కడెం ప్రాజెక్ట్ నుంచి 14,333 క్యూసెక్కుల వరద ఎల్లంపల్లి బరాజ్‌లోకి వస్తున్నది. ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.87 టీఎంసీల నీరు ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మోయతుమ్మెద వాగు ద్వారా ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి 771 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు ఉప్పొంగుతున్నది. ఎస్సారార్ జలాశయానికి 1870 క్యూసెకుల వరద వస్తున్నది. జలాశయంలో 27.54 టీఎంసీల నీటి సామర్థ్యానికిగాను ప్రస్తుతం 5.663 నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్లో అత్యధికం
కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఉదయం వరకు సగటున 52.5 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా గంగాధరలో 78.6 కురిసింది. పెద్దపల్లి జిల్లాలో సగటున 42.9మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా ధర్మారంలో మండలంలో అత్యధికంగా 67.7 కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 9.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందుర్తి మండలంలో 14.6మిల్లీమీటర్లు నమోదైంది. జగిత్యాల జిల్లాలో 70.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో 111.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికాైర్డెంది.