Heavy Rains | కార్పొరేషన్, జులై 23 : కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులుతో పాటుగా నగరంలోని అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లన్ని గంటల పాటుగా వరద నీటిలోనే ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లోనూ వరదనీరు నిలిచిపోవటంతో భారీ వాహనాలు, ద్విచక్ర వాహనదారులుసైతం అవస్థలు పడాల్సిని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాపు, సిరిసిల్ల రహదారిలోని పద్మనగర్ చౌరస్తా, రాంనగర్ ప్రాంతం, మరోవైపు మంచిర్యాల చౌరస్తా, అల్గునూర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీగా వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాశ్మీర్‌గడ్డ, సాయినగర్, భగత్‌నగర్, విద్యానగర్, జ్యోతినగర్, భాగ్యనగర్, ముకరంపుర, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో ఇళ్లల్లోని పలు వస్తువులు మునిగిపోయాయని వాపోయారు.