స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ అయిందా..? చట్టబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదని తెలిసినా బీసీవర్గాలను నమ్మించేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిందా..? నెలల తరబడి రిజర్వేషన్ల అంశాన్ని సాగదీసి, హడావుడి చేసి, ఆపై జీవో ఇచ్చి నమ్మించేందుకు చేసిన ప్రయత్నాలు హస్తం పార్టీకి శరాఘాతంగా మారబోతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
మేనిఫెస్టోలో పెట్టిన ఆ హామీ కార్యరూపం దాల్చదంటూ మొదటి నుంచీ న్యాయనిపుణులు చెబుతున్నా వినిపించుకోకుండా గొప్పలకు పోయిన అధికారపార్టీ, ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో తనకుతానే సెల్ఫ్‌గోల్ అయింది. పరిస్థితులు తారుమారు కావడంతో ఆ నెపాన్ని ఇతర పార్టీలపైకి నెట్టే ప్రయత్నం చేస్తుండగా, ప్రభుత్వ తీరుపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటూ తూర్పార పడుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు కాగా, వీటి పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత మాత్రం లేదు.
కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై గురువారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. అలాగే తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా పడింది. నిజానికి ఇలాగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముందు నుంచి న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు.
అంతేకాదు, చట్టబద్ధంగా ఉంటే తప్ప రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని అనేక మంది ప్రభుత్వానికి చెప్పారు. అక్కడితో ఆగకుండా.. గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఆధారాలతో సహా ప్రభుత్వ పెద్దలకు చూపించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని బీసీ వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి తప్పించుకోవడానికే సర్కారు ముందు నుంచీ ఒక ఎత్తుగడతో వెళ్లిందన్న విమర్శలు వస్తున్నాయి. ముందుగా అసెంబ్లీలో తీర్మానం పెట్టింది.
ఆ సమయంలో ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ పార్టీని బద్నాం చేసి, అందులో నుంచి తప్పించుకుందామన్న ప్లాన్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ అక్కడి నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గవర్నర్ వద్దకు బిల్లు పంపి.. అక్కడ ఆమోదముద్ర పడకుండా బీజేపీ అడ్డుకుంటుందని కొన్నాళ్లు అటువైపుగా బద్నాం చేసే కార్యక్రమాన్ని ఎత్తుకున్నది.
ఇలా భిన్న రకాలుగా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌కు, అన్నివైపుల నుంచి తమ వైఫల్యాలే కనిపించడంతో చివరకు గత్యంతరం లేని పరిస్థితులో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోనంబర్ 9ని జారీ చేసింది. నిజానికి ఈ జీవో ఇచ్చినప్పటి నుంచి కోర్టులో చెల్లుబాటు కాదంటూ మెజార్టీ న్యాయ నిపుణులు, విశ్లేషకులు చెబుతూ వచ్చారు. అయినా తాము అమలు చేసి చూపిస్తామంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తూ వచ్చింది. బీసీలను నమ్మించే ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో హడావుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో షెడ్యూలు జారీ చేయించింది.
అంటే వివిధ అంశాల్లో సర్కారు చేసిన హడావుడి చూస్తే.. 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తున్నట్టు భ్రమలు కల్పించే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. తీరా చూస్తే ముందుగా అనుకున్నట్టుగానే హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇన్నాళ్లూ చేసిన హడావుడి అంతా బీసీ వర్గాలను నమ్మించేందుకు చేసిన ప్రయత్నమే అనేది స్పష్టమవుతున్నదని సంబంధి వర్గాలే పేర్కొంటున్నాయి.
గొప్పలకు పోయి బొక్కబోర్లా..
ఇన్నాళ్లూ బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తామని గొప్పలు చెప్పిన హస్తం పార్టీ, హైకోర్టు స్టే ఇవ్వడంతో మాట మార్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుకుంటున్నాయని విమర్శలు చేస్తున్నది. నిజానికి ఈ విషయంలో ఎక్కడ ఏ పార్టీ అడ్డు చెప్పిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఇన్నాళ్లూ చెప్పిన గొప్పలన్నీ మటుమాయం అయ్యాయి. ఇప్పడీ పరిస్థితి నుంచి గట్టేందుకే ఇతర పార్టీలపై విమర్శలకు దిగుతున్నదని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. గొప్పలకు పోయి తనకు తానే సెల్ఫ్‌గోల్ అయిందనే విమర్శలు అధికార పార్టీ నాయకుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, తామే చేశామని జబ్బలు చరుచుకునేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు తారుమారు కావడంతో ఇప్పుడు వేరే పార్టీలపైకి నెపం నెట్టేందుకు కాంగ్రెస్ మరో ఎత్తుగడ వేస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
ఈ విషయం సంబంధితవర్గాలకు పూర్తిగా అర్థం కావడంతో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. బీసీ వర్గాలను కావాలనే ఒక వ్యూహాత్మకంగా మోసం చేసిందని విమర్శిస్తున్నారు. నిన్నటి వరకు దేశంలో ఎవరూ చేయలేని రిజర్వేషన్ తాము అమలుచేసి చూపిస్తామని చెప్పి ఆర్భాటపు ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నాయకులు, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలోనన్న ఆలోచనలో పడిపోయారు.
నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ అడ్డంకులు లేకుండా ఒక వేళ 42 శాతం రిజర్వేషన్ అమలైతే అదే ఎజెండాగా ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ, ప్రస్తుతం స్టేతో క్షేత్రస్థాయి నాయకులు ప్రజలకు ఏమి చెప్పలేని సంకటస్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. పైన ఉండే నేతలు బాగానే ఉంటారని, క్షేత్రస్థాయిలో చెప్పుకోవాల్సింది తామే కదా అని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ఆర్భాటపు ప్రచారంతోపాటు చట్టబద్ధంగా అమలు చేయలేని హామీలు ఇచ్చినప్పుడే తమ పార్టీ సెల్ఫ్‌గోల్ అయిందని, ప్రజలకు సమాధానం చెప్పుకోలేని సంకటస్థితిలో పడ్డామని వాపోతున్నారు.
ఎన్నికలు జరుగుతాయి.. నామినేషన్లు వేయండి?
నిజానికి హైకోర్టులో జరుగుతున్న విచారణ నేపథ్యంలో చాలామంది ఔత్సాహిక పోటీదారులు నామినేషన్లు వేయాలా.. వద్దా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడారు. ఈ పరిస్థితిని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు.. ‘ఎన్నికలు జరుగుతాయి. ఎటువంటి ఊగిసలాట వద్దు. కచ్చితంగా నామినేషన్లు దాఖలు చేయండి. అదంతా పార్టీ, ముఖ్యమంత్రి చూసుకుంటారు’ అంటూ ఆయా నియోజకవర్గ పార్టీ గ్రూపుల్లో విసృత ప్రచారం చేసుకున్నారు. హైకోర్టు విచారణలో ఏమి జరుగుతుందో తెలియకుండానే.. చివరి నిమిషం వరకు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేసిన తీరు ప్రస్తుతం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌లా మారింది.
అలాగే హైకోర్టులో గురువారం విచారణ ఉందని తెలిసినా.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పలు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడుత ఉమ్మడి జిల్లాలోని 30 జడ్పీటీసీ స్థానాలతో పాటు 311 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికారులు ఆమేరకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ గడువు అంటే.. ఈ నెల 9 నుంచి 11 వరకే ఉండడంతో గురువారం పలు చోట్ల ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో దాఖలు చేసిన నామినేషన్లను ఏమిచేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది.
బీసీలు ఆలోచన చేయాలి
రాష్ట్రంలో ఒకవర్గం పన్నిన కుట్రలో భాగంగానే బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చింది. దీని వెనుక బీజేపీ ఉంది. బీసీలకు రాజ్యాధికారం వస్తే ఆ పార్టీ ఉనికికి ప్రమాదమని భావిస్తున్నది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చట్టబద్ధత ఉంటే కోర్టులో నిలబడేది. అగ్రకులాలకు చెందిన నాయకులే జీవోలు ఇస్తున్నారు. అదే కులాలకు చెందిన వారు కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారు. తమ పరిస్థితి ఏంటో బీసీలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఒక్కతాటిపైకి వచ్చి ఆధిపత్య కులాలను రాజ్యాధికారానికి దూరం చేయాలి. అప్పుడే అణగారిన బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
– పూసాల సంపత్ కుమార్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కాంగ్రెస్ మరోసారి మోసం
కాంగ్రెస్ మొదటి నుంచీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నది. చట్టబద్ధంగా రావాల్సిన 42 శాతం రిజర్వేషన్లపై కుట్రలు చేస్తున్నది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండ కూడదని ఇంద్ర సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. అయినా అసెంబ్లీలో తీర్మానం జరిగి గవర్నర్ ఆమోదం పొందితేనే చట్టబద్ధత వస్తుంది. ఇది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది. కోర్టు నిర్ణయంతో బీసీలపై చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, తూతూ మంత్రంగా చర్యలు చేపట్టింది. లోపభూయిష్టంగా జీవో ఇచ్చి, హైకోర్టు ముందు బొక్కబోర్లా పడింది. బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్పా రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రాదు.
– గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు
బీసీలకు రేవంత్ మోసం
42 శాతం రిజర్వేషన్ల పేరిట రేవంత్‌రెడ్డి మరోసారి బీసీలను మోసం చేసిండు. కోర్టు స్టే ఇచ్చేవరకు పరిస్థితిని తెచ్చి జీవితాలతో చెలగాటం ఆడుతున్నడు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులతోనే రాష్ర్టాన్ని నడపాలని కుట్ర చేస్తున్నడు. బీసీ మంత్రులకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలి. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లును ఆమోదింపజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనయ్. బీసీ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘం నాయకులు ఏకం కావాలి. కలిసి కట్టుగా పోరాటం చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అన్నీ తెలిసే నాటకాలు
రిజర్వేషన్ల పేరిట రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారు. చట్టపరంగా నిలబడదని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే జీవోను జారీ చేశారు. ఈ జీవోను కోర్టు కొట్టివేస్తుందని తెలిసి కూడా నాటకాలు ఆడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై న్యాయస్థానం స్టే ఇవ్వడం బీసీ వర్గాలకు తీవ్ర నిరాశ కలిగించింది. దీనికి ఆయన బాధ్యత వహించాలి. కాంగ్రెస్ మాటలు, హామీలను తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదు.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
జీవో 9లో అనేక లోపాలు
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆదరబాదరగా ఇచ్చిన జీవో నంబర్ 9లో అనేక లోపాలున్నాయి. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టులో అబాసుపాలయింది. బీసీ జనాభా లెక్కలపై ప్రభుత్వం నియమించిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ప్రభుత్వం సేకరించిన ఎంపరికల్ డాటా కూడా శాస్త్రీయంగా లేదనే విమర్శలు వచ్చాయి. బీసీల జనాభా 2024 ప్రకారం సర్వే చేశామని చెప్పినా.. ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రం 2011 ప్రకారం పరిగణించింది. ఇతర వర్గాల జనాభా లెక్కలు కూడా స్పష్టంగా లేవు. మార్చిలో ఆమోదించిన బిల్లు పెండింగ్‌లో ఉండగా, జూలైలో ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టబద్ధతలేని జీవోను 9ను జారీ చేసింది. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి.
– పొలాడి రామారావు, ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు