Harvesting |చిగురుమామిడి, ఏప్రిల్ 9: అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోకుండా ఉండేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానకొండూరు డివిజన్ ఏడిఏ శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో వరి పంటలను ఏవో రాజుల నాయుడుతో కలిసి బుధవారం పరిశీలించారు. రైతుల వరిచేలు కోతకు వచ్చాయని, రైతులు వాతావరణ శాఖ అందించే సూచనలు గమనిస్తూ అందుకు అనుగుణంగా వరి కోతలు చేపట్టాలన్నారు.
వర్ష సూచన ఉంటే వాయిదా వేయడం మంచిదన్నారు. పూర్తిగా పరిపక్వతకు వచ్చాకనే కోతలు మొదలుపెట్టాలని లేకుంటే నష్టపోయే పరిస్థితులున్నాయన్నారు. వరి కోతకు 10 రోజుల ముందుగానే తడులు ఆపి వేయాలన్నారు. వడగళ్ల వర్షానికి వరి చేను ఒరిగి నేల వాలుతాయన్నారు. వర్షం తగ్గి పొలం ఆరగానే వారి కర్రలను జత చేసి కడితే కోసేటప్పుడు సులువుగా ఉంటుందన్నారు.
అవసరమైతే వరి చేనులో బాటలు వేసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉంటే నేలకొరిగిన వరి పొలాలలో మొలకలు రాకుండా ఉప్పు ద్రావణం చల్లాలన్నారు. వర్ష సూచనలు దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొంచెం ఎత్తుగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఆరబెట్టాలన్నారు. దాన్యం కింద తాటిపత్రులు కప్పాలని, కొనుగోలు కేంద్రాలలో తార్పాలిన్లు, తాటిపత్రులు అందుబాటులో ఉంటాయన్నారు.
రైతులు మధ్య దళారులకు ధాన్యం అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలని రైతులు సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఏర్పడినట్లయితే సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలని రైతులకు ఏడిఏ సూచించారు. వీరి వెంట ఏఈఓ ఫరీద్ తదితరులున్నారు.