మా రైతులకు రైతు బంధు ఇయ్యటానికి డబ్బులుండవ్. మా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులుండవ్. రూ.2వేల పింఛన్ రూ.4వేలు ఇస్తానని అబద్ధాలాడిండు. మహిళలకు రూ.2500 ఇస్తనని మోసం చేసిండు. వీటికి డబ్బులుండవ్. మరి లేవా.. అంటే ఉన్నయ్. ఒక్క రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉన్నయ్. అవి ఎక్కడ ఖర్చు పెట్టిండు అంటే.. జూబ్లీహిల్స్‌లో పెద్ద ప్యాలెస్ ఉన్నా.. అది చాలదని రూ.వందల కోట్లు పెట్టి క్యాంపాఫీసు కట్టిండు. ఫ్యూచర్ సిటీలో మరోటి కడుతున్నడు. ఇప్పుడున్న హెలీక్యాప్టర్ సరిపోదని రూ.5కోట్లు పెట్టి కొత్తది కొంటాడట. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు వందల కోట్లు పెట్టిండు. అందాల పోటీలకుంటయ్.. ఫుట్‌బాల్ సోకు ఆటకుంటయ్.. ఎయిర్ బస్సు హెలీక్యాప్టర్కుంటయ్.. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటయ్.. కానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఉండయ్. రైతు బీమాకు ఉండయ్. మా అవ్వ, తాతలకు పింఛన్లకు ఉండయ్.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్/జమ్మికుంట, జూన్ 12: తెలంగాణ బాగుపడాలంటే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. అందుకు కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్యపడొద్దని, కేసులకు బెదరవద్దని సూచించారు. కష్టకాలంలో పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసానిచ్చారు.
జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సభ్వత్వ నమోదు, సర్ నమోదు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదంతా డిజిటలైజేషన్ ప్రకారం సాగుతుందని, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సభ్యత్వ నమోదులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ఎండగట్టాలని, రేవంత్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని, ఆయన ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని విమర్శించారు. విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆయనకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం పైసల్లేవని మండిపడ్డారు. పైగా కేసీఆర్ పథకాలను ఎగ్గొడుతున్నారని ఆగ్రహించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు ఉచిత కరెంటుకు మంగళం పాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, రైతు డిస్కం తెచ్చి 6గంటలకే పరిమితం చేసేలా చూస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పేరిట రైతులకు రూ.74వేల కోట్లు ఇస్తే.. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రూ.20వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిందన్నారు. ఐదు నెలలుగా రైతు బీమా ఎల్ఐసీ ప్రీమియం కట్టడం లేదని మండిపడ్డారు.
ఇక ఎరువులు అందించకుండా.. పంటలు కొనకుండా.. బోనస్ ఇవ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న సాక్షిగా హామీలు అమలు చేస్తానని మాట తప్పాడని విమర్శించారు. ‘నీ హిట్లర్ పాలన అంతం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నార’ని, రేవంత్‌రెడ్డిని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ డిపాజిట్ గల్లంతేనని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఏవైనా హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు.
నియోజకవర్గంపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, అందుకు ఇక్కడి నుంచే రైతు బంధు, దళిత బంధు పథకాలను ప్రారంభించిన విషయాలను గుర్తు చేశారు. ప్రభుత్వంపై కొట్లాడుతున్న కౌశిక్‌పై కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. డంప్ యార్డు తరలించేదాకా ఉద్యమిస్తామని, అసెంబ్లీలో నినదిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హుజూరాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని, గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కమలాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పలువురు పార్టీలో చేరగా, వారికి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ శ్రీనివాస్, పింగిళి రమేశ్, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నా నలభై ఏళ్ల రాజకీయం జీవితంలో ఎన్నో చూసిన. కేసీఆర్ గొప్ప నాయకుడు. తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు. అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. దేశానికే వన్నె తెచ్చిన ప్రాజెక్టు అది. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నది. కేసీఆర్ ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతయి. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నడు. కుంగిన రెండు మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయిస్తలేడు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు పాటుపడుతున్నడు. మరమ్మతులు ఆయనతో కాదు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాల్సిందే. మరమ్మతులు చేయాల్సిందే. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పనితీరు భేషుగ్గా ఉన్నది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.
– జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కాంగ్రెస్ సర్కారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూపాయి పని చేయలే. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినవే. ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వడం లేదు. ఇబ్బందులు పెడుతున్నది. ఎన్నికల సమయంలో నేను రూ.వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పిన. ప్రభుత్వం మనది రాలే. అయినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు. అప్పుడు రూ.వెయ్యి కోట్లు తెచ్చుడే. అభివృద్ధి చేసుడే. పంట కొనేందుకు రేవంత్ సర్కారు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తున్నది. మార్కెట్లో మక్కలు కొనాలని నేను వెళ్లి డిమాండ్ చేస్తే కొనుడు ప్రారంభించిన్రు. యూరియా దొరుకుత లేదు. దళితబంధు రెండో విడుత విడుదల చేయడం లేదు. 2023లో కల్వల ప్రాజెక్టు తెగిపోయింది. నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక్క పైసా ఇస్తలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను రద్దు చేసిన్రు. డంప్ యార్డు రద్దు చేసేంత వరకు ఊరుకునేది లేదు. ఉద్యమిస్తూనే ఉంట. శ్రేణులెవరూ అధైర్య పడొద్దు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంట. సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలె.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
పార్టీకి కార్యకర్తలే బలం. కేసీఆర్ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినం. సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. గ్రామాల్లో తిరగాలి. సభ్యత్వం చేయించాలి. త్వరలో కమిటీల ఏర్పాటు జరుగుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు. ఉద్యమకారులున్న నేల ఇది. గులాబీ కంచుకోటిది. ఉద్యమ సమయంలోనైనా.. ఎప్పుడైనా ఇక్కడ గులాబీ జెండాకే పట్టం కడుతున్నరు. ప్రజలందరికీ పార్టీ రుణపడి ఉంటుంది. అందుకే కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలంటే ఎక్కువిష్టం. నియోజకవర్గంపై అభిమానం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి.
– రాకేశ్‌రెడ్డి, సభ్యత్వ నమోదు హుజూరాబాద్ ఇన్చార్జి
కేసులకు భయపడేది లేదు. వచ్చేది మన ప్రభుత్వమే. హుజూరాబాద్ అంటేనే గులాబీకి అడ్డా. కేసీఆర్ ఆశయ సాధన కోసం ఇక్కడి ప్రజలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటరు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే రేవంత్ సర్కారు కక్షగడుతున్నది. రెండున్నరేళ్లలో యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడం లేదు. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు జాడేలేదు. మాటలు చెప్పడమే కానీ, ఒక్క హామీ నెరవేర్చడం లేదు. పార్టీ కార్యకర్తలంతా ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా పనిచేయాలే. కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. సీఎంగా కేసీఆర్ అయ్యేంత వరకు విశ్రమించకుండా పనిచేయాలే.
– గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు
హుజూరాబాద్ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నరు. రాష్ట్రం ఏర్పడే వరకూ వెనుతిరగలేదు. సాధించిన రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచినయ్. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నాయకులు ఎవరైనా గులాబీ జెండా కోసం పనిచేస్తున్నరు. ఎన్నికలు ఏవైనా గెలిపించుకుంటున్నరు. ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ మీద అలా అభిమానం ఉన్నది. ఇప్పటి నుంచే పార్టీ గెలుపే ఎజెండాగా పనిచేయాలే. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలే.
– సతీశ్‌బాబు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే