కరీంనగర్, కార్పొరేషన్ జూలై 1 : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇక నుంచి భవిష్యత్‌లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే విజయమని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. కరీంనగర్ అంటే తొలి తొలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంటుందని, అందుకే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కొత్త పథకాలకు ఈ గడ్డపై నుంచే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఈ నెల 25 వరకు సాగుతుందని, శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. ఇతర రాష్ర్టాల్లో ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా రెండు ప్రభుత్వాలు కుట్రలు చేసే ప్రమాదం ఉందని, బీఎల్ఏలు కీలకంగా ఉండాలని సూచించారు.
బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్‌లో కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై, అధికారపార్టీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును తూర్పార పట్టారు. నిన్నామొన్నటి వరకు మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చిన రేవంత్‌రెడ్డి మాటల్లో ఇప్పుడు తడబాటు కనిపిస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టు ఆయన తాజాగా మాట్లాడిన మాటలద్వారా తెలుస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. వరుస వైఫల్యాలతో నడుస్తున్న ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి, కరీంనగర్ గడ్డకు విడదీయరాని పేగుబంధం ఉందని, తెలంగాణ మలిదశ ఉద్యమానికి, తొలి సింహగర్జనకు, కేసీఆర్ ఆమరణ దీక్షకు ఈ నేల వేదికైందని గుర్తు చేశారు. ఆనాడు ఆమరణ దీక్షకు వెళ్తున్న కేసీఆర్‌ను అల్గునూర్ చౌరస్తాలో అరెస్టు చేస్తే.. యావత్తు ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ఆందోళన చేసి అండగా నిలిచారని చెప్పారు. బీఆర్ఎస్ ఏర్పడిన తొలినాళ్లలోనే జడ్పీ చైర్మన్లను గెలిపించి గులాబీ జెండాను ఆశీర్వదించిన చరిత్ర ఈ గడ్డకు ఉందన్నారు. రెండుసార్లు ఎంపీగా రాజీనామా చేసినా కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్‌కు రైల్వే లైన్, తాగునీటి పథకం మంజూరు చేయించారని, ఉమ్మడి పాలకులు వాటిని తొక్కిపెట్టినా సీఎం అయ్యాక కేసీఆర్ మిషన్ భగీరథతో నీళ్లు ఇవ్వడంతోపాటు రైల్వే లైన్ పనులను పరుగులు పెట్టించారని తెలిపారు.

ప్రస్తుతం సర్ కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఇప్పటివరకు సర్ జరిగిన రాష్ర్టాల్లో కుట్రలు చేసి కొంత మంది ఓటర్లను తొలగించినట్టు వార్తలొస్తున్నాయని, అందుకే అప్రమత్తత చాలా అవసరమన్నారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువత కూడా ఇప్పుడే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని, సర్ ప్రక్రియ ఈ నెల 25 తేదీ వరకు ముగుస్తుందని చెప్పారు. ప్రతి కార్యకర్త రోజుకు 3 గంటల సమయం కేటాయించి పది రోజుల్లో ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు సహాయం చేయడానికి, అనుమానాలు నివృత్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రతి నియోజకవర్గానికి, జిల్లాకు ప్రత్యేకాధికారులను, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, బీఆర్ఎస్ నాయకులు ఆ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ 20 బూత్ ఏజెంట్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాలు జరుపుతున్నారని, ఏ బూత్‌లో ఎంత పని జరిగిందనేది ఆయన ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని అభినందించారు.
పార్టీకి కళ్లు, చెవులు బూత్ ఏజెంట్లేనని, రాజకీయాల్లో ఎదగడానికి ఇది తొలి మెట్టుగా భావించాలని సూచించారు. గతంలో బూత్ ఏజెంట్లుగా కష్టపడి పనిచేసిన వారే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బూత్ ఏజెంట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తే పార్టీకి ఘన విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల రూపకల్పన, తద్వారా అందిన సాగునీరు, ప్రస్తుతం నీటి కొరత ఎదురవుతున్న ఇబ్బందులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివరించారు. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు గ్రామాలకు కలిగిన నీటి వసతి, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తూము, తద్వారా తరలి వచ్చిన కాళేశ్వరం జలాలు, ఫలితంగా రైతులు పంటలు పండించిన తీరును కండ్లముందుంచారు. ప్రస్తుతం సాగునీరందించడంలో సర్కారు నిర్లక్ష్యం, ఆ ఏడు గ్రామాల్లో నీటి కోసం రైతులు పడుతున్న ఇక్కట్లు, ఈ నేపథ్యంలో నీరివ్వాలని చేపట్టిన మహాధర్నా వంటి అంశాలను అర్థమయ్యేలా విజువల్స్‌తో వివరించడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల గోసలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సభ విజయవంతమైంది. నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొత్త జోష్ కనిపించింది.

కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీళ్లతో కరీంనగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండినయ్. పంట పొలాలు కళకళలాడినయ్. కానీ, కాంగ్రెస్ పాలనలో సాగునీటి గోసలు మొదలైనయ్. కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో రైతులు నారు వేసే పరిస్థితి లేదు. కాలువలన్నీ ఎండిపోయినయ్. వానల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చినయ్. ఈ విషయాన్ని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నీళ్లివ్వాలనే ఆలోచన చేయడం లేదు. నీళ్లివ్వడం చేతకాకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తం. రైతులకు నీళ్లిస్తం. కాంగ్రెస్ ఏవేవో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది.
ఏ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు లేదు. ఏదో చుట్టపు చూపుగా పిలిపించి పంపించిన్రు. నగరం నడిమధ్యలో జువెల్లరీ షాపుల్లో దొంగతనం జరిగితే స్పందన కరువైంది. కరీంనగర్ మండలంలో హనుమాన్ విగ్రహాన్ని దొంగతనం చేస్తే కేసు లేదు కానీ, తాము ఆ విగ్రహాన్ని తీసుకువస్తే మాపై కేసులు పెట్టిన్రు. బీఆర్ఎస్ కార్యకర్తలు కేసులకు భయపడద్దు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క జీవోతో ఈ కేసులన్నింటినీ కొట్టి వేసే విధంగా చేద్దాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కరీంనగర్‌తో కార్యకర్తల ఆశీర్వాద బలంతోనే బీఆర్ఎస్ గెలుపు సాధ్యమైంది. ఎప్పటికి మీకు రుణపడి ఉంటా.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
ముఖ్యమంత్రికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేయాలి. అక్కడి నుంచి నీటిని మధ్యమానేరుకు, అలాగే ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మధ్యమానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులు ఎడారిని తలపిస్తున్నయ్. పరిస్థితి ఇలాగే ఉంటే కరీంనగర్ ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడే ముప్పు ఉన్నది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరొస్తుందన్న కుట్రలు, కుతంత్రాలను రేవంత్ పక్కన పెట్టాలి. అన్నదాతల సంక్షేమం కోసమైనా యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోతలను ప్రారంభించాలి.