తిమ్మాపూర్/ మానకొండూర్, జూన్ 16 : పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవని, అన్ని స్కాములే ఉన్నాయని, దేవుని మీద ప్రమాణం చేసి దగా చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలన్నీ ప్రజలకు అర్థం అయ్యాయని, అందుకే ఫ్రస్టేషన్ మొదలైందని, అధికార బలంతో బెదిరింపులకు దిగుతున్నదని, కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఓటమి అంచున ఉండి ఫ్రస్టేషన్లో ఉన్నోళ్లు, ఇక నాతో కాదనుకున్న వాళ్లే కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తారని, ఆ లెక్కన కాంగ్రెసోళ్లు ఎన్ని కేసులు పెడితే బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి వచ్చినట్టే లెక్క అని తేల్చిచెప్పారు.
ఏ వర్గం చూసినా కేసీఆర్‌వైపే చూస్తున్నదని, కలిసి కట్టుగా ముందుకు సాగితే మన విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్‌లోని లక్ష్మీనరసింహగార్డెన్లో మంగళవారం మానకొండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షత వహించగా, హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే.. తిరిగి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు బీఆర్ఎస్ శ్మశానానికి పోయిందని, ఇక మొలకెత్తనివ్వనని, అది చచ్చిన పామని అంటున్నాడని ఆగ్రహించారు. అసలు ఆయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు గానీ, బీఆర్ఎస్ను మొలకెత్తనియ్యనని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ విమమర్శించారు.
రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారని, ప్రధానంగా రైతులను దగా చేశారని మండిపడ్డారు. ఆయనకు రైతులపై ప్రేముంటే మూడుసార్లు ఎగ్గొట్టిన రైతుబంధు డబ్బులు రూ.19 వేల కోట్లను వెంటనే విడుదల చేసి ఖాతాల్లో వేయాలని మానకొండూర్ గడ్డ మీదుగా డిమాండ్ చేశారు. రైతుబీమా గడువు ముగిసి నాలుగు నెలలవుతున్నా ఎల్ఐసీకి ఎందుకు డబ్బులు చెల్లించలేదో సీఎం సమాధానం చెప్పి తీరాలని నిలదీశారు. రైతు డిస్కం పేరుతో రేవంత్‌రెడ్డి రైతుల ఊసురు పోసుకుంటున్నాడని, డిస్కం అమల్లోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఉరేసినట్టే లెక్క అని ఆగ్రహించారు. మంత్రులకు తెలియకుండానే.. వారి శాఖల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవి తెలుసుకోకుండా మంత్రులు మాట్లాడుతుంటే జాలేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పతారా ఖతమైపోయిందని స్వయంగా ఆయనే ఒప్పుకుంటారని ఎద్దేవా చేశారు.
మానకొండూర్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే మనసు పెట్టి పోరాటం చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు. అధికారం ఉన్నా.. లేకపోయినా బ్రహ్మాండమైన బలగం ఉందని, తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఊరూరికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారని గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలినాళ్ల (2001)లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీలను గెలిచిన నియోజకవర్గం మానకొండూర్ అని, ఆనాటి నుంచి నేటివరకు ఆ పోరాట ప్రతిమ అలాగే ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం మన కార్యకర్తల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని, దేవేందర్, వేణు, రసమయి, సోషల్ మీడియాకు చెందిన నాయకులు సతీశ్, సది.. ఇలా అందరి మీద పదేళ్ల కిందటి కేసులు తీసి ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తున్నదన్నారు. అయినా కేసులకు, తాటాకు చప్పుళ్లకు మనం భయపడమన్న విషయం ఇంకా వారికి అర్థం కావడం లేదన్నారు.
ప్రతి ఇరవై ఏళ్లకు ఒకసారి జరిగే ఓటర్ల సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నదని, గులాబీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. వచ్చే నెల 25 వరకు అధికారుల బృందం డోర్ టూ డోర్ సర్వే చేస్తుందని, గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పట్టణాల్లో ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంటారని, మండల స్థాయిలో ఎంఆర్వో, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రోగ్రాంకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని చెప్పారు. సర్వేలో భాగంగా ఇంటింటికీ వచ్చి రెండు పేపర్లు ఇస్తారని, ఆ ఫారం నింపి ఒకటి వాళ్లకు ఇచ్చి, ఇంకొకటి ‘రిసీవ్డ్ కాపీ’ కింద వాళ్ల సంతకం చేసి ఇస్తారని, దానిని మనం భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ 2002లో ఓటు లేకపోయినా, ఫ్యామిలీ గ్రూపింగ్‌లో పేరు లేకపోయినా.. 10 రకాల ఆధారాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే ఓటు నమోదు చేస్తారని చెప్పారు. చదువు, ఉద్యోగాల కోసం దుబాయ్, బెంగళూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, బంధువులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండానే వారి వివరాలు అందించి ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు అందులో అధికారికంగా భాగస్వామ్యం కల్పించిందని, మన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్వోల వెంట వెళ్లి ఓటర్లకు సహకరించాలని నిర్దేశించారు. ఓటర్లకు ఫామ్ నింపడం రాకపోతే మన పార్టీ ఏజెంట్లే స్వయంగా నింపి అధికారులకు అందజేయాలని సూచించారు. జూలై ఆఖరులో ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుందని, ఆ తర్వాత అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఇస్తారని చెప్పారు. ఒకవేళ తుది జాబితాలో ఓటు గల్లంతైతే కలెక్టర్‌కు గానీ, రాష్ట్ర ఎన్నికల అధికారికి గానీ, అవసరమైతే హైకోర్టుకు గానీ వెళ్లి ఓటు హక్కు పొందే అవకాశం మనకు ఉంటుందన్నారు. మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని, బూత్ లెవెల్ ఏజెంట్లందరూ అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, నాయకులు చల్ల హరిశంకర్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేశ్, సిద్దం వేణు, శేఖర్ గౌడ్ స్వామిరెడ్డి, ఏకానందం, నాయిని వెంకట రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకన్న, మహిపాల్, రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్ గడ్డం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ను దించేందుకు బీఆర్ఎస్ నాయకులంతా వీరసైనికులై పోరాడాలి. ఆ పోరాట స్ఫూర్తి మన నరనరాల్లోనే ఉన్నది. నిజానికి మానకొండూర్ నియోజకవర్గం ఆది నుంచీ గులాబీ జెండాకు అండగా నిలిచింది. అయితే గత ఎన్నికల్లో ప్రజలు మనల్ని ప్రశ్నించే వాళ్లుగా నిలిపారు. అయినా సంతోషం. ఎవరేమిటో ఇప్పుడు ప్రజలకు తెలిసింది. మానకొండూరులో బీఆర్ఎస్ పనైపోయిందంటూ విమర్శలు చేసిన సమయంలో 76 గ్రామ పంచాయతీలను గెలిచి మన సత్తా నిరూపించుకున్నాం. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ పతాక ఎగురవేశాం. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడికి నా ధన్యవాదాలు. రేపటి భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మానకొండూర్ నియోజవర్గంలో మీటింగ్ పెడుతున్నామని తెలిసి రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు చింపేశారు. అటువంటి కుట్రలకు అడ్డుకట్టవేసి మనం బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకున్నాం. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చిన ప్రతి కార్యకర్తకూ జన్మంతా రుణపడి ఉంటా.
గతంలో ఎవైనా చిన్న చిన్న తప్పిదాలు ఉన్నా మనసులో పెట్టుకోవద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. వాటికి భయపడే వాళ్లం మేం కాదు. నెత్తురు చిందే దారుల్లోనే విత్తనాలమై మొలకెత్తాం. అటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లాఠీలు విరిగినా భయపడరు. మిస్టర్ కవ్వంపల్లి.. మీ తాటాకుల చప్పుళ్లకు భయపడం. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో. బీఆర్ఎస్ హయాంలో మానకొండూర్ నియోజకవర్గంలోని చెరువులు నింపడమేకాదు, చేపలు పెంచాం. ఇప్పుడు ఆ నీళ్లు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారు. వాగులో ఇసుకను తోడేస్తున్నారు. గుట్టలను తవ్వేస్తున్నారు. ఎటుచూసినా దోపిడే కనిపిస్తున్నది. మాజీ మంత్రి హరీశ్‌రావు కృషి లేకుంటే తోటపల్లి రిజర్వాయర్ అయ్యేది కాదు. మధ్యమానేరు, అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్ ఇలా అనేక రిజర్వాయర్లు మనమే కట్టాం. లక్ష ఎకరాలకు నీళ్లు అందించిన చరిత్ర మన బీఆర్ఎస్ది. గోదావరి నీళ్లతో రైతుల కాళ్లు కడిగినం. భవిష్యత్తు తరాల కోసం మళ్లీ కొట్లాడుదాం. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. భయమంటేనే ఎరుగని కార్యకర్తలం మనం. ఎవడో బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లం కాదు. మన ఐక్యతే మన విజయానికి నాంది అవుతుంది.
రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఈ విషయం ఇప్పటికే రేవంత్‌రెడ్డికి అర్థమైంది. అందుకే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు పెట్టాలంటేనే జంకుతున్నారు. కేసీఆర్‌కు ఎడమ, కుడి భుజాలుగా హరీశ్‌రావు, కేటీఆర్ నిలుస్తున్నారు. వీరి మార్గంలో మనమంతా నడువాలి. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్, హరీశ్‌రావుకు దక్కుతుంది. తెలంగాణ భవిష్యత్ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముడిపడి ఉంది. బరాజ్ రెండు పిల్లర్లు కుంగితే.. మరమ్మతు చేపట్టే తెలివి కాంగ్రెస్‌కు లేదు. అధికారంలోకి వచ్చి ముప్పై నెలలు గడుస్తున్నా.. ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా..? చెప్పాలి. గన్నేరువరం మండలాన్ని సాధించిన ఘనత మాజీ ఎమ్మెల్యే రమసయి బాలకిషన్‌కు దక్కుతుంది. గుండ్లపల్లి రోడ్డు మంజూరై 30 నెలలు గడుస్తున్నా నిర్మాణం కావడం లేదు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరిట తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడమే తప్ప తెలంగాణ గురించి ఆయనకు అవసరంలేదు. ప్రజలను హింసించిన హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటామని ఎవరైనా చెబుతారా..? హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా. ఎక్కడికిపోయినా ఉత్సాహం కనిపిస్తున్నది. ఇక ముందు ఏ ఎన్నిక జరిగినా గులాబీ జెండానే ఎగిరి తీరుతుంది. మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు.
అతి త్వరలోనే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తాం. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పటికే అన్ని వర్గాలు కాంగ్రెస్ తీరుపై రగిలిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటున్న ప్రతి నాయకున్ని, కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీని వదిలి కొంత మంది వెళ్లారు. అటువంటి వాళ్లు మళ్లీ వస్తామంటే.. మనం ఒప్పుకొనే ప్రసక్తేలేదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎంగా చేసుకునేందుకు పోరాడుదాం. ఇదే సమయంలో కన్నతల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం. మనకు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్‌కు రథసారథులుగా హరీశ్‌రావు, కేటీఆర్ ఉన్నారు. రెండేళ్లు ఆగితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్లీ రామరాజ్యం వస్తుంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మానకొండూర్‌తో సహా 80 నుంచి 85 సీట్లు గెలుస్తాం. రసమయిని మళ్లీ గెలిపించాలి. మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలి. లేదంటే రాష్ట్రం మరో జార్ఖండ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లా మారుతుంది.
బీఆర్ఎస్ పార్టీకి పునాదులు కార్యకర్తలే. మన విశ్వాసమే మనల్ని మళ్లీ గెలిపిస్తుంది. మన దగ్గర గెలిచే శక్తి ఉన్నది. కష్టపడి పనిచేద్దాం. ఎవరికీ భయపడకుండా ముందుకెళ్దాం. పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం. పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేసుకుందాం. మనం క్రమశిక్షణతో ఉంటూ పని చేసుకుంటూ పోవాలి. ఆదర్శంగా ఉండాలి.
సభకు హాజరైన కార్యకర్తల ఊపు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ గెలువడం ఖాయంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకూ ఇదే ఊపును కొనసాగించాలి. మానకొండూర్ నియోజకవర్గంలో ఏ పిలుపు ఇచ్చిన ఇదే స్థాయిలో ఉత్సాహంగా ఉంటరు. రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటాలి.