హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, నవంబర్ 24 : బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరంతో రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయని, వాటిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అపవాదు వేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దీపం అయిందన్నారు. ప్రాజెక్టు కూలిపోతే అక్కడి నుంచే హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాల కోసం 20 టీఎంసీలు తరలించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరైన ఆయన, పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఒకవైపు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అంటుంటే.. మరోవైపు వారి మంత్రులే గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, ఇంకో మంత్రి కాళేశ్వరం నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తామని ఎలా చెప్పారో? తెలపాలని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కావాలనే అపవాదు వేశారని ప్రజలందరికీ అర్థమైందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల కోసం ఎన్నో ఆలోచనలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని, తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం 30 లక్షల మెట్రిక్ ట న్నుల పంట పండితే కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో కోటి 54 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని వివరించారు. స్వయంగా దేశ ప్రధాని లోక్‌సభలోనే నీళ్ల విషయంలో కేసీఆర్‌ను పొగిడారని గుర్తు చేశారు.
ఫ్రీజింగ్ ఎత్తివేసి దళిత బంధు రెండో విడుత నిధులను వెంటనే విడుదల చేసి దళితులను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం ప్రారంభించి, 18,500 కుటుంబాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అందించారని గుర్తు చేశారు.
దళితబంధు కోసం హుజూరాబాద్‌లో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దళితులకు అండగా ఉంటూ వారి సమస్యలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు, బీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.