కమాన్‌చౌరస్తా/ ఇల్లందకుంట/ హుజూరాబాద్/ రూరల్/ చొప్పదండి/ శంకరపట్నం, కరీంనగర్ రూరల్, జూన్ 1: హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్‌గడ్డలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలను మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. భగత్‌నగర్ అంజనాద్రిపై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో సాయంత్రం సామూహిక విష్ణుసహస్రనామ, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
ఇక్కడ చిలకపాటి హనుమంతరావు పాల్గొన్నారు. రాంనగర్ రమాసత్యనారాయణస్వామి, అభయాంజనేయస్వామి ఆలయంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, చైర్మన్ చల్ల హరికృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత, లేబర్అడ్డా భక్తాంజనేయస్వామి ఆలయాల్లో ఈవో అనిల్ కుమార్, క్లర్క్ మహేశ్, కొండయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదర్శనగర్ రాజరాజేశ్వర అభయాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మెతుకు కనకయ్య, భూమిరెడ్డితో పాటు మల్లయ్య, రమణ, మనోహర్, జయలక్ష్మి, స్వాతి, సుజాత, శ్రీవేణి, లత, వినోద, సరిత, వీణ, రమ, భారతి, సుజాత పాల్గొన్నారు. అపరభద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అంజన్న దీక్షాపరులు, భక్తులతో కాషాయ శోభను సంతరించుకున్నది.
అర్చకులు స్వామివారి మూలవిరాట్టుకు అర్చనలు, ప్రత్యేకాభిషేకాలు చేశారు. దేవాలయంలో ఐదువేల మంది దీక్షాపరులు మాలవిరమణ చేశారు. ఏర్పాట్లను ఈవో కందుల సుధాకర్, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హుజూరాబాద్ పట్టణంలోని, రంగనాయకుల గుట్టవద్ద గల ఆంజనేయస్వామి ఆలయాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించగా, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, శ్రీనివాస్ దంపతులు సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు ముత్యంరాజు, తాళ్లపెల్లి శ్రీనివాస్, నాయకులు కొలిపాక శ్రీనివాస్, కళ్లెపు అఖిల్ తదితరులున్నారు.
తుమ్మనపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి పట్టణంలో షిర్డీసాయి భజనమండలి ఆధ్వర్యంలో సత్సంగ్, భజన కార్యక్రమాలు నిర్వహించారు. కేశవపట్నం హనుమాన్ ఆలయంలో గీతాపారాయణం, హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. హనుమాన్ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తనుకు ఓంకారం, పాలడుగుల బాబన్న, కర్మకొండ రాజయ్య, తనుకు సత్యనారాయణ, అల్లెంకి మనోహర్, పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షాపరులు దర్శించుకున్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్‌లోని పంచముఖ హనుమాన్ పీఠంలో పరబ్రహ్మానంద స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.