పచ్చటి పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విచ్చల విడిగా తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో తయారీదారులు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తుండగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే పదేళ్ల ముందటి పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. గుడుంబా తయారీని ఒక సామాజిక సమస్యగా గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునరావాస పథకాన్ని అమలు చేసి, తయారీదారులకు బతుకుదెరువు చూపింది. మళ్లీ తయారు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తయారీదారులు తిరిగి తమ పాత వృత్తికి నైపుణ్యం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుడుంబా తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. గుట్టలు, అటవీ ప్రాంతాలు, వ్యవసాయ బావులు, ఇతర రహస్య ప్రాంతాల్లో గుట్టుగా గుడుంబా తయారు చేసి విక్రయించే వారు. అత్యంత ప్రమాదకరమైన ఈ మత్తు పానీయాన్ని తాత్కాలిక మత్తు కోసం తాగిన అనేక మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో అనారోగ్యంపాలై బతికున్న శవాలుగా మారిపోయారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను సామాజిక కోణంలో పరిశీలించారు. జీవనోపాధి కోసమే కొందరు గుడుంబా తయారు చేస్తున్నారని గుర్తించారు. వీరికి పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో 2017 మార్చిలో 216 జీవో తెచ్చారు. దీని ప్రకారం అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు సర్వే నిర్వహించారు. కరీంనగర్లో 109, జగిత్యాలలో 127, పెద్దపల్లిలో 102, సిరిసిల్లలో 38 చొప్పున మొత్తం 376 గ్రామాల్లో 412 కుటుంబాలు గుడుంబా కాస్తున్నట్లు గుర్తించారు.
ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసినా, జైళ్లకు పంపించినా తిరిగి అదే వృత్తిగా గుడుంబా తయారీ చేయడాన్ని గుర్తించి, వారిలో ఎలాగైనా మార్పు తేవాలని భావించారు. అందుకోసం పునరావాస పథకాన్ని అమలు చేసి, ప్రత్యామ్నాయ ఉపాధికి బాటలు వేశారు. కరీంనగర్లో 77, జగిత్యాలలో 159, పెద్దపల్లిలో 118, సిరిసిల్లలో 58 కుటుంబాలకు 172 పాడి యూనిట్లు, 138 కిరా ణా దుకాణాలు, 14 లేడీస్ ఎంపోరియంలు, 10 ఆటోమొబైల్ షాపులు, 25 టెంట్హౌస్లు, ఇతరంగా మరో 48 యూనిట్లను నెలకొల్పుకొనేందుకు ఒక్కో కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. దీంతో వారు ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తూ వచ్చారు.
అంతే కాకుండా, అప్పటి ప్రభుత్వం గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. దీంతో అటు వైపు కన్నెత్తి చూసేందుకు జంకేలా చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్లలో కరీంనగర్లో 100, జగిత్యాలలో 99, సిరిసిల్లలో 98, పెద్దపల్లిలో 96 శాతం గుడుంబా తయారీని నిర్మూలించినట్లు అప్పట్లో ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఆరేడేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగింది.
పునరావాస పథకం అమలై ఏడేళ్లు గడుస్తున్నాయి. వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న గుడుంబా తయారీదారులు మళ్లీ దారి తప్పుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి జైల్లో పెట్టడం, తహసీల్దార్ల వద్ద బైండోవర్లు చేయడం, రెండు, మూడు సార్లు దొరికితే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కొంత వరకు గుడుంబా తయారీని అరికట్టగలిగింది. ప్రభుత్వం మారడంతో తయారీదారులు మళ్లీ విజృంభిస్తున్నారు. రెండు మూడు నెలలుగా మరీ రెచ్చి పోతున్నారు. ఎక్కడపడితే అక్కడ గుడుంబాను తయారు చేస్తున్నారు. ఏడెనిమిది నెలల్లో వచ్చిన మార్పును గమనిస్తే 2017 ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం అంబాల్పూర్, సైదాపూర్ మండలం రాయికల్ తండా, ఘనపూర్ తండా, తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం, రామడుగు మండల కేంద్రంతోపాటు ఇదే మండలంలోని తిర్మలాపూర్, చిగురుమామిడి మండలం రేకొండ, చొప్పదండి మండలం రాఘంపేట వీణవంక మండలం చల్లూరు, కల్వల, మానకొండూర్ మండలం నిజాయితీగూడెం గ్రామాల్లో రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. జగిత్యాలలోని రాయికల్, పెగడపల్లి, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖని సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, తదితర మండలాల్లో గతంలో మాదిరిగానే గుడుంబా గుప్పు మంటోంది. ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు నిత్యం నిఘా పెట్టి దాడులు చేస్తున్నా గుడుంబా తయారీ మాత్రం ఆగడం లేదు..
గుడుంబా తయారీకి ప్రాణాలకు హాని చేసే మత్తు పదార్థాలను వాడుతున్నారు. బెల్లం, పటిక, జీడి గింజలు, నాగస్వరం బిల్లలు వంటివే కాకుండా పైరుకు ఎరువుగా వాడే యూరియాను వాడుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో విక్రయదారుల నుంచి 5 కిలోల కంటే ఎక్కువ బెల్లం కొనుగోలు చేసినా వారి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉండేది. వాటిని ప్రతి నెలా ఎక్సైజ్ పోలీసులకు ఇవ్వాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ఆంక్షలు లేకుండా పోయాయి. ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో తెప్పించుకునే వారు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో తెచ్చుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఇటీవలి కాలంలో గుడుంబా తయారీకి సిద్ధం చేసిన 16,935 లీటర్ల బెల్లం పానకాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారంటే ఎంత విచ్చల విడి తనం పెరిగి పోయిందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో దసరా వస్తున్న నేపథ్యంలో తయారీదారులు పెద్ద మొత్తంలో గుడుంబా తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు, జిల్లాకు ఒక టాస్క్ఫోర్స్టీం ఉన్నాయి. గుడుంబా స్థావరాలపై ఈ టీములు నిరంతరం నిఘా పెట్టినప్పటికీ అనేక రహస్య ప్రదేశాల్లో గుడుంబా తయారవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ మాదిరిగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, లేదంటే ఎందరో అమాయకులు గుడుంబా రక్కసికి బలికాక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.