ముకరంపుర, ఫిబ్రవరి 11: ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన గృహజ్యోతి అమల్లో గందర నెలకొన్నది. ప్రజాపాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయకపోవడంతో డేటా లేక యంత్రాంగం తం టాలు పడుతున్నది. సిబ్బంది స్పాట్ బిల్లింగ్ మిషన్ల ద్వారా వివరాల సేకరణకు ఆటంకం కలుగుతున్నది.
ఇప్పటికే దరఖాస్తుల్లో మీటర్ నంబ ర్, బిల్లు వివరాలు ఇచ్చిన వినియోగదారులు, మళ్లీ ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, రేషన్‌కార్డు ఇవ్వాలని అడుగుతుండడంతో ఆగమైతున్నారు. ఇటు సిబ్బంది, అటు అధికారులు ఏం చేస్తున్నారో తెలియక పరేషాన్ అవుతున్నారు. అయితే ఆలస్యంగా మేల్కొన్న యంత్రాంగం మొబైల్ఫోన్లలో మళ్లీ అర్జీలను నమోదు చేస్తున్నది.
గృహజ్యోతి అమలుకు విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బిల్లింగ్ యంత్రాల్లో దరఖాస్తు దారుల మీటరు కనెక్షన్ నంబర్, రేషన్, ఆధార్, యజమాని సెల్ నెంబరు నమోదు చేయాల్సి ఉన్నది. ఇందుకు అధికారులు బిల్లింగ్ యంత్రాలను అప్డేట్ చేసి, ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వీటికి అనుసంధానించారు. అయితే అర్జీల్లోని సమాచారం ఆన్లైన్లో లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
అధికారులు ఆలస్యంగా తప్పు తెలుసుకున్నా రు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేయకపోవడంతో సమస్య తలెత్తుందని గుర్తించారు. ఆగమేఘాల మీద మొబైల్ఫోన్లలో ఆన్లైన్ చేస్తున్నారు. ఇందుకు రాత్రింబవళ్లు సిబ్బంది శ్రమిస్తున్నారు. విలువైన సమాచారాన్ని గోప్యంగా ఉం చాల్సిన అధికారులు జనసంచారం ఉండేచోటే చేస్తుండడంతో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పకడ్బందీగా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.
గృహజ్యోతి పథకానికి అర్హుల గుర్తింపు పక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 200 యూని ట్లు విద్యుత్ వినియోగించే వారందరికీ ఫ్రీ కరెం ట్ ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు అందరికీ కాదు అర్హులకే అంటూ మెలిక పెడుతున్నది. వినియోగదారులు ఎంత కరెంట్ వాడుతున్నారో అనే సమాచారం ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నది.
వాళ్లు నెలనెలా కడుతున్న బిల్లులను పరిగణలోకి తీసుకుంటే తెలిసిపోతుంది. అయినా ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత మళ్లీ ఇంటింటికీ వివరాలు సేకరిస్తుండడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో సాకు చూపుతూ అసలుకే మోసం చేస్తుందేమోనని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడమే నిదర్శనమని చెబుతున్నారు.