కోనరావుపేట, మార్చి 8: ఎన్నో ఆశలతో యాసంగిలో సాగుచేసిన వరి పొలాలు నీరు లేక నెర్రెలుబారుతున్నాయి. కోనరావుపేట మండలంలో ఈ యాసంగి సీజన్లో దాదాపు 17,800 ఎకరాలకు పైగా వరి పంటలను రైతులు సాగుచేశారు. ఇందులో ధర్మారం, పల్లిమక్త, వెంకట్రావుపేట, ఏగ్లాస్పూర్, శివంగాళపల్లి, నిజామాబాద్, కనగర్తితోపాటు పలు గ్రామాల్లో నీరు లేక పంటపొలాలు ఎండిపోతున్నాయి. పొట్ట దశకు వచ్చిన వరి పంట సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. తలాపున ఉన్న మల్కపేట రిజర్వాయర్లో 0.75టీఎంసీ డెడ్ స్టోరేజీ ఉన్న భూగర్భజలాలలు అడుగంటిపోతున్నాయి. దీంతో రైతులు నీళ్లు లేక బోరుమంటున్నారు. వ్యవసాయ బావుల్లో నీరు లేకపోవడం, బోరు మోటార్లలో నీరు రాకపోవడంతో రైతులు లక్షలు వెచ్చించి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ బావుల్లో క్రేన్ల సాయంతో పూడికతీత, సైడ్ బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా బోరు మోటార్లలో నీరు ఎండిపోవడంతో పంటపొలాలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
బావి తవ్వించిన ఫలితం లేదాయె
నాకు ధర్మారంలో రెండెకరాల భూమి ఉన్నది. కొత్తగా బావి తవ్వించిన. కొన్ని నీళ్లు ఉండడంతో రెండెకరాల్లో వరి వేసిన. అయితే భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రూ.2లక్షలతో సైడ్బోర్లు వేయించిన. అయినా ఫలితం లేకుండాపోయింది. దీంతో పంట పొట్ట దశలోనే ఎండిపోతున్నది.
– కొమ్ము తిరుపతి, రైతు, ధర్మారం(కోనరావుపేట)
ఎకరం ఎండిపోయింది..
నాకున్న ఎకరం పొలంలో వరి వేసిన. నీళ్లు లేక పంట ఎండిపోయే దశకు రావడంతో పక్క రైతుల బావి నీటిని అడిగి పారించిన. అయినకూడా నీళ్లు అందకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీ లేక గొర్రెల కాపరులకు పంటను మేత కోసం ఇచ్చిన. పంట పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయిన.
– ఆసరి రాజయ్య, రైతు, ధర్మారం(కోనరావుపేట)