సిరిసిల్ల రూరల్, నవంబర్ 15 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో శనివారం ‘ గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే – 2025’ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పీజీటీఎస్ఏయూ మార్గదర్శకాల మేరకు “గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే–2025” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా. కె.బి. సునీతా దేవి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కొత్తగా చేరిన 110 మంది విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటి, వాటిని సంరక్షిస్తూ జియో ట్యాగ్ చేశారు. మొక్కలు సంరక్షణను తమ బాధ్యతగా స్వీకరించారు. ఫ్యాకల్టీ అడ్వైజర్లు, ఫార్మ్ సూపరింటెండెంట్, ఫార్మ్ మేనేజర్, OISA సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కళాశాలలో స్థలాభావం, నీటి కొరత వంటి సవాళ్లున్నప్పటికీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందడమే కాకుండా కాలేజీలో సుస్థిర పర్యావరణ దృక్కోణం బలపడిందని అసోసియేట్ డీన్ సునీతా దేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.