కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి జిల్లాలో రెండో విడుత పంచాయతీ పోరు ముగిసింది. ఆదివారం పందొమ్మిది మండలాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏకగ్రీవమైన 26 సర్పంచ్, 887 వార్డు స్థానాలు పోను.. మిగతా 392 సర్పంచ్, 2874 వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఎన్నికలు నిర్వహించగా, పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం చలి ప్రభావం కనిపించగా, 9గంటల తర్వాత నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువతీ యువకుల నుంచి పండు ముసలి వరకు బారులు తీరి మరీ ఓటేశారు.
మొత్తం 6,10,734 మంది ఓటర్లకు 5,06,618 మంది (83 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్యన మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాల్లో, ఆ తర్వాత సర్పంచు స్థానాల ఓట్లు లెక్కించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటల నుంచే ఎన్నికల ఫలితాలు రాగా, పెద్ద పంచాయతీల్లో రాత్రి 10గంటల వరకు అధికారులు వెల్లడించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు మధ్యన విజేతలను ప్రకటించారు. సర్పంచ్ విజేత తేలగానే వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు.
కరీంనగర్ : చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూర్, శంకరపట్నం
జగిత్యాల : జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్, రాయికల్, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల
పెద్దపల్లి : పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి
సిరిసిల్ల : బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట