Education sector | సిరిసిల్ల టౌన్ జూన్ 14 : ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు తెలంగాణలో కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రైవేటు సూళ్ల యాజమాన్యాలు జలగల్లా పట్టి వారి రక్తాన్ని పీడిస్తున్నారనీ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పలు పాఠశాలల యాజమాన్యాలు 1వ తరగతికి రూ.30వేల నుండి 50వేలు, అదే విధంగా అదే పాఠశాలలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా ఆ స్కూలు ముద్రించిన పాఠ్యపుస్తకాలు అమ్ముతూ స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతూ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు.
అంతే కాకుండా వారి స్కూల్ పుస్తకాలు ఫలానా బుక్ షాప్ లో మాత్రమే దొరుకుతాయి అంటూ బుక్ స్టాల్స్ తో పర్సంటేజ్ మాట్లాడుకొని తల్లిదండ్రుల నుండి వివిధ రకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తూ, వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారని అన్నారు.
దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సామాజిక అంతరం ఏర్పడి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకొని ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ ఇంచార్జి sk బాబా, సాయి దీపక్, వెంకటరమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.