మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కొత్త దరఖాస్తుల సేకరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అర్జీలను ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారాల ద్వారా దరఖాస్తులు సేకరించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి దరఖాస్తుల సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంలో తాము పాలు పంచుకోవడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం హడావుడిగా పట్టా, పరిహారం కోసమంటూ.. కొత్త దరఖాస్తులను ఎందుకు సేకరిస్తున్నారు? ఇది పరిహారం కోసమా..? లేక వారి ప్రచారం కోసమా..? లేక స్థానిక సంస్థల్లో లబ్ధిపొందేందుకా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదే అదనుగా సందట్లో సడేమియాలా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. నిజానికి 2011 నుంచి 2014 మధ్య ముంపు గ్రామాల పరిహారం చెల్లింపులో.. అప్పట్లో చాలా మంది దళారులు రాజ్యమేలి, అధికారులతో మాట్లాడి అంచనాలు పెంచుతున్నట్టు చెప్పి కోట్లు కొల్లగొట్టారు. ఆశల ఊసులో పడిన బాధితులు.. అడిగినన్నీ డబ్బులు ఇచ్చి ఆనాడు మోసపోయారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండగా, దరఖాస్తుల ప్రక్రియపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గానీ, అధికారులు గానీ స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో ఇప్పుడు దరఖాస్తుల జాతర నడుస్తున్నది. 2014 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి పట్టా, ప్యాకేజీ ఇప్పిస్తామంటూ కొత్తగా అర్జీల సేకరణ జరుగుతున్నది. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇప్పటికే వరుస కథనాలతో బయట పెట్టడం తెలిసిందే. అంతేకాదు, బోయినపల్లి మండలం కొదురుపాక పంచాయతీలో కూర్చొని కొంత మంది కాంగ్రెస్ నాయకులు నేరుగా దరఖాస్తులు తీసుకోవడం బయటకు వచ్చిన విషయం విదితమే. అయితే దీనిని లోతుగా పరిశీలిస్తే.. ప్రతి గ్రామంలోనూ ఇదే తరహాలో అర్జీలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ప్రభుత్వం నుంచి పథకాలు, ప్యాకేజీలు అందాలంటే నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రజావాణిలో లేదా సంబంధిత అధికారులకు నేరుగా అర్జీ పెట్టుకోవాలి. కానీ, ఇవేవి లేకుండానే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారంలో తమ వివరాలు నింపి.. సదరు దరఖాస్తులను నేరుగా కాంగ్రెస్ నాయకులకే అప్పగిస్తున్నారు. వాస్తవానికి పునరావాస ప్యాకేజీ కొంతమందికి అందలేదన్న ఫిర్యాదులు గత ప్రభుత్వంలో రాగా.. ఆనాటి కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు 12 గ్రామాల్లో సభలు నిర్వహించి, ముంపువాసుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు మొత్తం 4,073 అర్జీలు రాగా, అందులో అర్హులను నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. అనర్హులుగా గుర్తించిన వారికి ప్రస్తుతం నేరుగా రెవెన్యూ శాఖ నుంచి లేఖలు పంపిస్తున్నారు. ఇది ముంపు గ్రామాల్లో గందరగోళానికి దారితీసినట్టు తెలుస్తున్నది. తమకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించిన అధికార పార్టీ నాయకులు.. అధికారుల నుంచి లేఖలు పంపించకుండా ఆపినట్లు తెలుస్తున్నది. దాని నుంచి బయటపడేందుకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దరఖాస్తుల వ్యవహారంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అలాగే జిల్లా అధికారుల నుంచి స్పష్టత రావాల్సిన అవసరమున్నది. నిజానికి తన పేరిట దరఖాస్తు ఫారాలు ముద్రించిన విషయం ఎమ్మెల్యేకు తెలుసా.. లేదా..? అన్నది తెలియాల్సి ఉన్నది. సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా తన వద్దకు వచ్చిన దరఖాస్తులు తీసుకోవడం ఒక ఆనవాయితీ. అలా వచ్చిన తర్వాత పరిష్కారం కోసం సిఫారసు లేఖలు పెడుతూ ప్రభుత్వానికి, అధికారయంత్రాగానికి పంపిస్తారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతారు. ఇప్పటివరకు ప్రతి ఎమ్మెల్యే వద్ద జరుగుతున్న ప్రక్రియ ఇదే. కానీ, ఏకంగా ముద్రించిన దరఖాస్తు ఫారాలు పంపించి, ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నాయకులే స్వీకరించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న వస్తున్నది. ఒక వేళ ఎమ్మెల్యే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే.. ఆ విషయంలోనైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరమున్నది. ప్రధానంగా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు తెరపైకి వస్తుండగా, ముఖ్యంగా గతంలో 12 గ్రామాల నుంచి స్వీకరించిన 4,073 దరఖాస్తుల్లో ఎంత మంది అర్హులో.. ఎంత మంది అనర్హులో చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది. ఈ దరఖాస్తులుండగానే.. కొంత మంది నాయకులు బహిరంగంగా కొత్త అర్జీలు సేకరిస్తున్నట్టు వెలుగులోకి రావడం అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలా..? వద్దా..? అన్నదానిపై అధికారయంత్రాగం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే అర్జీల స్వీకరణకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా.. లేదా..? రాకపోతే బహిరంగంగా ప్రజల నుంచి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే దరఖాస్తులు స్వీకరిస్తుంటే అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నట్టు? అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా..? లేక తమకెందుకులే అనుకుంటున్నారా..? ఇది దేనికి సంకేతం? పాత దరఖాస్తులను రద్దు చేస్తారా..? లేక వాటినే పరిగణలోకి తీసుకుంటారా..? ఇలా అనేక ప్రశ్నలు ముంపువాసుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పష్ట ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంత బహిరంగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో అధికారుల మౌనం ముంపువాసులకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టడమే కాదు, మరోసారి మోసపోయే ప్రమాదాన్ని తీసుకురానున్నది. నిజానికి 2011 నుంచి 2014 మధ్య.. మధ్యమానేరులో ముంపునకు గురైన ఇళ్లు, భూములకు పరిహారం చెల్లింపులు జరిగాయి. ఆనాడు ఇళ్లకు అంచనాలు పెంచి అధిక డబ్బులు వచ్చేలా చేస్తామని చాలా మంది దళారులు మాయమాటలు చెప్పి కోట్లు దండుకున్నారు. అప్పట్లో చాలా గ్రామాల నుంచి దళారుల వ్యవస్థ నడువగా, అప్పుడు పనిచేసిన కొంత మంది అధికారులు కూడా వీరితో కుమ్మక్కయ్యారు. అయితే ముందుగా వేసిన అంచనాల ప్రకారం సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించని పక్షంలో ఏటా నిబంధనల ప్రకారం కొంత అమౌంట్ పెరుగుతుంది. దానిని చూపి దళారులు లక్షలు కాజేశారు. ఈ దళారుల దందాలో చాలా మంది మోసపోయారు. అప్పటి మోసాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇప్పుడు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తుండగా కొంతమంది దళారులు.. మళ్లీ ముంపు వాసుల్లో ఆశలు రేకెత్తించి, దోచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి విషయంపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్నది. నిజంగానే అర్హులైన వారికి పట్టా, ప్యాకేజీ ఇప్పించే ఉద్దేశం ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించాల్సిన అవసరమున్నది. ఆ క్లారిటీ ఇవ్వకుండా దరఖాస్తులు తీసుకోవడం వల్ల ముంపుగ్రామాల ప్రజలు మరోసారి దళారుల చేతిలో మోసపోయే అవకాశాలుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.