MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూలై 30 : కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్లతో పాటు పరిసర గ్రామాలకు చెందిన 114 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఆశించిన స్థాయిలో అసరాగా నిలవడం లేదన్నారు.
ఆయా పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్న ధైర్యంతో అప్పు చేసి ఆడ పడుచుల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ అసమర్థత కారణంగా నెలలు గడిచిన డబ్బులు మంజూరు కావడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ఠంచన్‌గా చెక్కులు అందించేవారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలనలో జాప్యంతో పెళ్లి జరిగి ఏడాది గడిచిన చాలా మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా కొంత మంది జంటలకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణ లక్ష్మి అందని పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేలా ప్రజలు దీవించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, నాయకులు మోసిన్, కాశిరెడ్డి మోహన్ రెడ్డి, మహ్మద్ అతిక్, ఎలుగూరి కిరణ్, రాజశేఖర్, గంగాధర్, శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.