హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): చట్టంలో నిర్దేశించిన విధివిధానాలను అనుసరించకుండా ప్రైవేటు భూములను వక్ఫ్ ఆస్తులుగా పేరొంటూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని పలు సర్వే నంబర్లలో తమ భూములను వక్ఫ్ ఆస్తులుగా పేరొంటూ 2001లో వక్ఫ్ బోర్డు జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సయ్యదా గౌసియా సుల్తానా తదితర 38 మంది హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ.. పిటిషనర్లకు 1990లోనే ఓఆర్సీలు జారీకావడంతోపాటు కొందరికి పట్టాలు, పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లు ఉన్నాయని, వాటిని ఏ కోర్టూ రద్దు చేయలేదని పేరొన్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం వారు ఆ భూములకు చట్టబద్ధ యజమానులుగా ఉన్నట్టు వెల్లడవుతున్నదని స్పష్టం చేశారు.
ఆ భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే ముందు 1954 నాటి వక్ఫ్ చట్టంలోని సెక్షన్లు 4, 5 ప్రకారం ప్రభుత్వం నియమించిన సర్వే కమిషనర్ ద్వారా సర్వే నిర్వహించి, విచారణ చేపట్టాల్సి ఉంటుందని, అభ్యంతరాలను స్వీకరించాక గెజిట్ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపారు. కానీ, ఈ కేసులో అలాంటి ప్రక్రియ చేపట్టినట్టు వక్స్ బోర్డు చెప్పడం మినహా ఎలాంటి చట్టబద్ధ రికార్డులు, ఆధారాలను సమర్పించలేదని పేరొన్నది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా పిటిషనర్ల ఆస్తి అనుభవం, బదలాయింపు హకులపై ప్రభావం పడుతున్నదని, రాజ్యాంగం కల్పించిన యాజమాన్య హకులకు భంగం కలుగుతున్నదని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియ లేకుండా జారీచేసిన 2001 నాటి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.