కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట వేసింది మొదలు.. చేతికొచ్చిన దిగుబడి అమ్ముకునే వరకూ అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది. సర్కారు మాటలు నమ్మి పంట మార్పిడి చేసి వాణిజ్య పంటలు వేసినా కొనేదిక్కు లేకుండా పోయింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పొద్దుతిరుగుడు పండించినా.. వరికి బదులు మక్క వేసినా.. అమ్ముకునేందుకు తిండీ తిప్పలు వదిలేసి సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక కొనుగోలు కేంద్రం ఇల్లంతకుంటలో సన్‌ఫ్లవర్ గింజలు పోసి యాభై రోజులు దాటినా తూకం వేయకపోవడం, కరీంనగర్‌తోపాటు మిగతా కేంద్రాల్లో మక్కలు పోసి పదిహేను రోజులు దాటినా కొనకపోవడంపై సర్కారు వైఫల్యానికి అద్దం పడుతున్నది. ఈ పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంట మార్పిడి చేయాలని, వరికి బదులు ఇతర పంటలు వేయాలని ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలను నమ్మిన ఉమ్మడి జిల్లా రైతులు యాసంగిలో వాణిజ్య పంటల వైపు మళ్లారు. మక్క, పొద్దుతిరుగుడుతోపాటు ఇతర పంటలు సాగు చేశారు. యూరియా కొరత వేధించినా.. రైతు భరోసా సకాలంలో రాకున్నా.. కరెంట్ కోతలు వెంటాడినా.. సాగునీటి గోస ఉన్నా.. ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాల కోర్చి పంటలు పండించారు. తీరా పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునేందుకూ అరిగోస పడుతున్నారు.
ఎంతో ఆశతో దిగుబడులను మార్కెట్లకు తెచ్చినా కొనే దిక్కులేక ఆగమవుతున్నారు. సర్కారు మక్క, పొద్దతిరుగుడు కొనుగోళ్లలోనూ విఫలం కాగా, రోజుల కొద్దీ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతంతో ఈ సారి పొద్ద్దుతిరుగుడు పెద్ద ఎత్తున సాగు చేసి, పంటను ఇల్లంతకుంట మార్కెట్‌కు తెచ్చి యాభై రోజలు అవుతున్నా కొనేవారు లేక విసిగిపోతున్నారు. నిత్యం పనులన్నీ వదులుకొని కాపలా కాస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు అడ్డికి పావుశేరు అమ్ముకొని ఒక్కో క్వింటాల్‌కు రూ.2200 వరకు నష్టపోతున్నారు. మరోవైపు మక్క రైతులు కూడా కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. కేంద్రాలకు తెచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా తూకం వేసే వారు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు 4వేల క్వింటాళ్లపైగా మక్క నిల్వలు పేరుకుపోయాయని వాపోతున్నారు. గన్నీ సంచులను సైతం తామే సొంతంగా సమకూర్చుకుంటున్నా కొనడం లేదని ఆవేదన చెందుతున్నారు.
మక్కలను కొనాలని ప్రతి అధికారి ముందు మోకరిల్లుతున్నారు. ఇంకోవైపు ఎకరాకు 25 క్వింటాళ్లే కొంటామని అధికారులు చెబుతుండడంతో మిగిలింది దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కారు వల్లే తమకీ దుస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం ఒక్కటే పండించడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని, అందుకే వాణిజ్య పంటలు వేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మొదలు మంత్రుల వరకు చెప్పడంతోనే తాము నమ్మి మోసపోయామని వాపోయారు. అసలు వాణిజ్య పంటలు కొనడానికి ప్రభుత్వం ముందున్న ప్రణాళిక ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఇంకేం పంటలు వేయాలని, ఏ పంటలు పండిస్తే కొంటారని నిలదీస్తున్నారు.