Godavarikhani | కోల్ సిటీ, జూలై 23: మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే… గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. మంగళవారం రాత్రి నుండి ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా మార్కెట్ లోకి వరద ప్రవాహం వస్తోంది. దీంతో మార్కెట్లో వినియోగదారులు నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారుల నష్టపోవాల్సి వచ్చింది.
బుధవారం కూడా వరద ప్రభావంతో అదే దుస్థితి నెలకొంది. చిన్న వానకే కూరగాయల మార్కెట్ మొత్తం అధ్వాన్నంగా మారుతోంది. ఇక భీకర వర్షాలు పడితే మోకాలు లోతు వరద నీటిలోనే కూరగాయలు కొనేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో మార్కెట్ అంతా పారిశుధ్యం లోపించి బురదమయంగా మారింది. కనీస వసతులు లేక వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.