Fish production | కలెక్టరేట్, జూలై 6 : ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య అభివృద్ధి పథకాలు గ్రామీణ మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాయని, చేపల ఉత్పత్తి పెరగడంతో వారి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కమిటీ సభ్యులు సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌తో సమావేశమై జిల్లాలో అమలవుతున్న మత్స్య అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
సహకార సంఘాలకు అందిస్తున్న ఆర్థిక సహాయం, చేప పిల్లల ఉత్పత్తి, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలను కలెక్టర్ బృందానికి వివరించారు. అనంతరం బృందం బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి ఉత్పత్తి విధానం, నిర్వహణ, ఆదాయ వనరులు, ప్రభుత్వ సహకారంపై క్షేత్రస్థాయిలో పరిశీలించింది. చేపల ఉత్పత్తి పెంపుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అధికారులు వివరించారు. ఈ పర్యటనలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు జూలియన్ మిలియన్, అనుజా శుక్లా, ఆర్పీ సిలార్డ్, ఇంతిసార్ ఎ. సిద్దిఖీ, దీపా సుమన్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.