కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను ఇవ్వడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీవో ఇచ్చామని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే తెలంగాణలోని బీసీ సమాజం భగ్గుమంటుందని హెచ్చరించారు. దానిని సంపూర్ణంగా అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిదేనని పేర్కొన్నారు.
బీసీలకు ఇచ్చిన జీవోలో పేరొన్నట్లు 42 శాతం రిజర్వేషన్లపై ఎవరూ కోర్టుకు పోవద్దని, బీసీల నోటికాడి బుక్కను దూరం చేయవద్దని తాము కోరుతున్నామని తెలిపారు. జీవో ఇచ్చామని, ఇక మీరు మీరు కొట్టుకోండని చేతులు దులుపుకొంటే ఊరుకునేది లేదని, అన్యాయం చేస్తే సహించాం కానీ, అవమానిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
జీవోపై న్యాయపరంగా చికులు రాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని, కోర్టులో ఇబ్బందులు వస్తున్నాయని మళ్లీ వెనకి పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జీవో ప్రకారం బీసీలకు ఎంత వాటా వస్తుందో చెప్పిన తర్వాతే ఎన్నికలకు పోవాలని సూచించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామన్న ఆయన, 42 శాతానికి సంబంధించిన జీవో 22 నెలల తర్వాత ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.