పెద్దపల్లి, జూన్ 13( నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని: సింగరేణి ఏరియా దవాఖానలు, డిస్పెన్సరీలలో సరిపడా మందులు లేక సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంతో ఇటు సింగరేణి యాజమాన్యం స్పందించింది. వెంటనే మందులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దానికి తోడు ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ సైతం గోదావరిఖని ఏరియా దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దవాఖానలో మందుల స్టోరేజ్, రోగులకు అందిస్తున్న మందుల వివరాలను ఫార్మసీ కౌంటర్ వద్ద ఉద్యోగులను, మందులు అందుకుంటున్న కార్మికులు, కార్మికుల కుటుంబాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీ-1పరిధిలోని సింగరేణి ఏరియా దవాఖాన, డిస్పెన్సరీలలో ప్రతిరోజూ 2500 మందికి ఓపీ సేవలందిస్తున్నట్లు తెలిపారు. 700 రకాల మందులు ఏరియా దవాఖానలో ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంటాయన్నారు. ఇక్కడ లేని మందులు సైతం రెండు నెలల్లో దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టి లోకల్ పర్చేస్ ద్వారా తెప్పించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దవాఖాన డీవైసీఎంవో డాక్టర్ అంబికను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఏరియా దవాఖాన సిబ్బంది ఉన్నారు.
‘సింగరేణిలో మందుల కొరత’ కథనంతో సింగరేణిలోని కార్మిక సంఘాల నాయకులు సైతం కదిలారు. దవాఖానలు, డిస్పెన్సరీల్లో మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని ఏరియా దవాఖాన వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం దవాఖాన డీవైసీఎంవో అంబికకు వినతి పత్రం అందించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సైతం స్పందించి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు దవాఖానల్లో మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సింగరేణి దవాఖానల్లో అసౌకర్యాలను దూరం చేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు.