కోరుట్ల, ఆగస్టు 7: కేసీఆర్ పాలనలోనే నేతన్నలకు పునర్వైభవం వచ్చిందని, చేతినిండా పని దొరికిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కోరుట్ల పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనం ఆవరణలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, రాట్నంపై నూలు వడికారు. నేత కార్మికులతో కలిసి పతాకావిష్కరణ చేశారు.
అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి, మాట్లాడారు. మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమని, అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలు తయారు చేసే నైపుణ్యం మన నేత కార్మికుల ప్రత్యేకత అని కితాబిచ్చారు. తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకున్న నేత కార్మికులకు సమైక్య పాలనలో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో మంచి రోజులు వచ్చాయని గుర్తు చేశారు. ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండికి వలస వెళ్లిన చేనేత కార్మికుల కోసం కేసీఆర్ వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించారని చెప్పారు.
చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాల అమలుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కోరుట్ల చేనేత సహకార సంఘం భవనాన్ని వాటాదారులకు దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘ మాజీ అధ్యక్షుడు గోనె శంకర్, పద్మశాలీ సంఘ అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి రాజ్‌కుమార్, టీఆర్పీఎస్ కార్యదర్శి ధనుంజయ్, నాయకులు పాల్గొన్నారు.