హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 18: ‘దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెచ్చి అమలు చేసింది. 10లక్షల్లో తొలుత 5 లక్షలు ఇస్తే మేం వ్యాపారాలు పెట్టుకున్నం. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చి మా పొట్టకొట్టింది. రెండో విడుత ఇవ్వాల్సిన 5లక్షలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంది’ అని హుజూరాబాద్ లబ్ధిదారులు మండిపడ్డారు. తామేం పాపం చేశామని, తమను గోస పెట్టినోళ్లు తమ ఉసురు తాకిపోతరని శాపనార్థాలు పెట్టారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా దళితబంధు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం చింతకాని మండలంలో దళితబంధు నిధులు విడుదల చేసి, హుజూరాబాద్‌లో మాత్రం రెండో విడత నిధులు ఆపడాన్ని తప్పుబట్టారు. ఇక్కడి దళితులు ఏం పాపం చేశారో..? చెప్పాలని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి భట్టి హుజూరాబాద్ నియోజకవర్గంపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. 10 నెలల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒత్తిడి చేస్తున్నా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందాన ప్రభుత్వ పరిస్థితి ఉందని వాపోయారు. దళితబంధు సాధన సమితికి భయపడే మంత్రి పొన్నం ప్రభాకర్ తమను నిరసన తెలుపకుండా అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిధులు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సురేశ్, రాజేశ్, నరేశ్, ఆకాశ్, భిక్షపతి, నాగరాజు, రమేశ్, కుమార్, విజయ్, శ్రీకాంత్, అర్జున్, సరిత, అరుణ, ప్రవీణ్ పాల్గొన్నారు.