కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పత్తి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం పత్తి రైతులను ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పత్తి విక్రయాలకు సీసీఐ అనేక కొర్రీలు పెట్టిందని, వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తాను సివిల్ సప్లయ్ మినిస్టర్‌గా పని చేసినపుడు దొడ్డు వడ్లు తీసుకోమని కేంద్రం కొర్రీలు పెడితే రాష్ట్ర కేబినెట్ మొత్తం 11 రోజులు ఢిల్లీలో ఉండి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీ వెళ్లి సీసీఐతో కొట్లాడి రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పత్తి అమ్ముకోకుండా.. మిల్లర్లు కొనకుండా సీసీఐ అనేక కొర్రీలు పెట్టిందని, ఈ కారణంగానే జిన్నింగ్ మిల్లులు మూత పడ్డాయని అన్నారు. సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లు సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రైతుల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల పత్తి బస్తాలు మోసుకుంటూ కలెక్టరేట్‌కు వచ్చారు. మెయిన్ గేటు వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు.. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.