కరీంనగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గూండా సంస్కృతిని అమల్లోకి తెస్తున్నదని, మంగళవారం ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నాయకులపై జరిగిన దాడి దీనికి నిలువెత్తు నిదర్శమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. విపత్తు కాలంలో చేయూతనివ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో విఫలమైన నేపథ్యంలోనే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని, వీటిని స్వాగతించాల్సిన కాంగ్రెస్ జీర్ణించుకోకుండా దాడికి పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజాస్వామ్య వాదులు ఈ నీచమైన చర్యను ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా దాడులకు పూనుకుంటూ దేశ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ప్రశాంతమైన తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం లేక, ప్రజలకు సౌకర్యాలు అందించలేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వమే గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ ఇలాంటి దాడులు చూడలేదని చెప్పారు.