కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్న రైతాంగం, రేవంత్ పాలనలో ఆగమవుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేయడంతో గోస పడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతుండడం, కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చూపడం వల్ల సాగు, తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నది. మెజార్టీ ప్రాజెక్టులు ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా కూడా నీటి కోసం తండ్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా నాడు ఏడాది పొడవునా కళకళలాడుతూ పంటల చివరి వరకూ నీరందించిన వరదకాలువ.. మూడేళ్లుగా ఉత్తదే అవుతున్నది.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గంలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. రోహిణీకార్తె ముగిసి నెల కావస్తున్నా నార్లు పోసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ సీజన్లో నార్లు పోసుకోవడానికి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలంటూ ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తుండగా.. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన గంగుల కమలాకర్ వరద కాలువ ద్వారా వారంలో నీళ్లివ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. పది రోజులు గడిచినా స్పందన లేకపోవడంతో రైతులతో కలిసి పోరుబాట పట్టారు. శనివారం లోయర్ మానేర్ డ్యాంలో క్రికెట్ ఆడి నిరసన తెలిపిన ఆయన, ఆదివారం కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు వరద కాలువ నుంచి సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ ఆచంపల్లి వరద కాలువ తూము వద్ద రైతు మహా ధర్నా చేశారు. ఏడు గ్రామాలకు చెందిన రైతులు బస్సుల్లో తరలివచ్చి మద్దుతు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టిన గంగుల, ఆ తర్వాత రైతు కేంద్రంగా సాగిన బీఆర్ఎస్ పాలనను గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు వరద కాలువ వట్టిపోయిన తీరును, రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాళేశ్వరం జలాలతో నింపి సాగునీరిచ్చిన తీరును, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్జీవంగా మారిన తీరును పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం అక్కడే వంటావార్పు చేశారు. సాగునీటి కోసం బీఆర్ఎస్ పోరుబాటను చేపట్టిందని, వరద కాలువ ద్వారా నీళ్లివ్వకపోతే రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు వరకూ మహా పాదయాత్ర చేసి పంప్‌లను ఆన్ చేస్తామని హెచ్చరించారు.
ఇటు రైతులను ఇబ్బంది పెడుతు న్న యూరియా యాప్‌ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆందోళనకు దిగారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై రైతులు, నాయకులతో కలిసి ధర్నా చేశారు. అర గంటకుపైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడి, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి గంగాధర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతును గోస పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి, గతంలో మాదిరిగా సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌ను రద్దు చేసేవరకూ బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రైతు కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్. ఆయన మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటరు. మా కష్టాలు తీరుతయ్. మేడిగడ్డ వద్ద మరమ్మతు చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కారు బాగు చేయిస్తలేదు. గోదావరి నుంచి నీరు వృథాగా పోతున్నా సీఎంతోపాటు మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వరద కాలువ ద్వారా నీరు రాకుంటే కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాల రైతులు సాగుచేసుకొనే పరిస్థితి లేదు. ఇట్లయితే ఈ సారి సాగు చేసుడు కష్టమే
– కాసం మల్లేశం, రైతు (బావుపేట)
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొత్తపల్లి మండలంలోని రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిండు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి వరద కాలువ ఆచంపల్లి తూము నుంచి ఏడు గ్రామాలకు నీళ్లు వచ్చేలా చేసిండు. అప్పుడు ఆయన చొరవ తీసుకోవడంతోనే పదేళ్లు రైతులు ఏ ఇబ్బంది లేకుండా సాగుచేసుకున్నరు. ఇప్పుడు వరద కాలువ నుంచి నీరు రాక గోస పడుతున్నరు. మళ్లీ పాత రోజులు వస్తాయని భయపడుతున్నరు. ఇప్పుడు మళ్లీ గంగుల కమలాకరే చొరవ తీసుకొని రైతుల కోసం పోరాటం చేస్తున్నడు.
– బోయిని బాలయ్య, రైతు
మా రైతుల దగ్గర చిన్న ఫోన్లే ఉన్నయి. ఈ చిన్న ఫోన్లల్ల యాప్ ఎట్ల వత్తది? యూరియా ఎట్ల బుక్ అయితది? రేవంత్‌రెడ్డికే తెలువాలె. కాంగ్రెసోళ్లకే తెలువాలె. యాప్‌ల ఎట్ల బుక్ చేసుడో తెలుస్తలేదు. యూరియా కోసం పోతే యాప్‌లనే బుక్ చేసుకొని వస్తేనే ఇత్తమని దుకాణపోళ్లు చెడుతున్నరు. మా కొడుకునో.. మనుమడితోనో బుక్ చేయించి దుకాన్లకు పోతే బత్తాలు లెవంటున్నరు. యూరియా కోసం దుకాన్ల చుట్టూ తిరుగుడుకే టైమ్ సరిపోతంది. ఇంక ఎవుసం ఎప్పుడు చేసుడు? వరి నాట్లు ఎప్పుడు ఏసుడు? సర్కారు యాప్‌ను తీసేయాలె. మునపటి లెక్క యూరియా బస్తాలు ఇయ్యాలె.
– బట్టు ఆదిరెడ్డి, రైతు (కాసారం)
మా రైతులం ఎక్కువ యూరియా బస్తాలు తీస్కపొయ్యి బుక్కుతమా..? అదేమన్నా తినే వస్తు వా..? ఎక్కువ బస్తాలు తీస్కపోయి ఇంట్ల పెట్టుకో వడానికి. మాకు ఎంత భూమి ఉన్నదో చూస్కొనే కదా బత్తాలు తీస్కపోతం. కేసీఆర్ సర్కారు టైమ్‌లో ఇచ్చినట్టు ఇప్పుడు సక్కగా యూరియా ఇత్తే సరిపోతది కదా! మళ్ల గీ యాప్.. గా యాప్ అని పెట్టి మా రైతులను ఎందుకు గోసవెట్టుడు? మా రైతుల మీద సర్కారుకు ఏమన్న ప్రేమ ఉంటే యాప్ బంజేయాలె. రైతుకు ఎన్ని అవుసరం ఉంటే అన్ని యూరియా బత్తాలు ఇయ్యాలె.
– జడ శ్రీనివాస్, రైతు చెర్లపల్లి (ఎన్)