కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 23 : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎప్పటికీ ప్రజలతోనే ఉంటారని చెప్పారు. ఈ రెండేళ్లలో నగరంలో ఒక్క పని కూడా చేయలేదని, మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని 21, 28వ డివిజన్లలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలకు ఆయన హాజరయ్యారు. 21వ డివిజన్లో బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి అయిన చల్ల హరిశంకర్, 28వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతిని గెలిపించాలని కోరారు.
వసంత పంచమి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ 28వ డివిజన్లో ప్రచారాన్ని ప్రారంభించామని, డివిజన్ ప్రజలు ఆశీర్వాదం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో వెయ్యి కోట్ల నిధులు తెచ్చి యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించామని గుర్తు చేశారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లిన మట్టి రోడ్డు అనేది లేకుండా సీసీ రోడ్లు వేశామన్నారు. కానీ, కాంగ్రెస్.. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కూడా కొనసాగించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఏన్నో చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ నగర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని విమర్శించారు. 21వ డివిజన్‌ను తాను దత్తత తీసుకుంటున్నానని, సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానన్నారు.
21వ డివిజన్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల హరిశంకర్‌ను గెలిపిస్తే మేయర్‌ను చేసి డివిజన్‌ను అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ గుడ్డి దీపంగా మారిందని, కేబుల్ బ్రిడ్జి పైన లైట్లు వెలగడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, 28వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు సరిత-అశోక్, మహేశ్, నాయకులు పెద్ది చంద్రమౌళి, మనోహర్, పసుల చరణ్, బెజగం మధు, మంచాల రవి, రవీందర్, పసుల యాదగిరి, కాలనీవాసులు పాల్గొన్నారు.