రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం.. షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. నవంబర్ 30న నాలుగో విడుత మాఫీ చేస్తున్నట్టు మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండుగ బహిరంగ సభా వేదికగా చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నేటికీ అమలుకు నోచుకోలేదు. ఆరోజు ఇచ్చిన 2,747 కోట్ల పైచిలుకు చెక్కు నేటి వరకు రైతు ఖాతాల్లో జమకాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత నివ్వకపోవడం చూస్తే మరోసారి రైతులను ధోఖా చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ చెప్పినంత సులువుగా మాఫీ చేయదని చెప్పడానికి ఇదే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రేవంత్ మాటలు నమ్మిన అన్నదాతలు రుణమాఫీ కోసం ఆగమవుతున్నారు. పది రోజులుగా మాఫీ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనచెందుతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే కరీంనగర్ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ అమలులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం, నాలుగో విడుత మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడుతల్లో రాష్ట్రవ్యాప్తంగా 22.37లక్షల మంది రైతులకు 17,993 కోట్లు బ్యాంకులకు చెల్లించిన సర్కారు, గత నెల 30న మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండుగ బహిరంగ సభా వేదికగా నాలుగో విడుత 2,747.87 కోట్లు విడుదల చేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెక్కును రైతులకు అందించగా, తద్వారా ఇప్పటి వరకు రుణమాఫీ కింద మొత్తం 20.68 వేల కోట్లు బ్యాంకులకు విడుదల చేసినట్టు ప్రకటించింది. 30న ప్రకటించిన 2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో 29,830 మంది రైతులకు 265 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా.. ఇప్పటి వరకు ఖాతాల్లో జమకాకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మూడు విడుతలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం, నవంబర్ 30న నాలుగోవిడుత రుణమాఫీ చేసింది. అయితే గతంలో మాఫీ కాని కొంత మంది రైతులకు నాలుగో దఫా మాఫీ అయినట్టు సమాచారం వచ్చింది. ఆ మేరకు అధికారులు సైతం ధృవీకరించారు. కానీ, రుణమాఫీ అయింది కదా అని కొత్త రుణం కోసం వెళ్తున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. ఇంకా మాఫీ డబ్బులు జమకాలేదనే సమాధానం బ్యాంకుల నుంచి వస్తున్నది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. పోనీ మాఫీ డబ్బులు ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతాయని అని అడిగితే.. బ్యాంకుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితి ఎదురవుతున్నది. వేలాది మంది రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం దీనిపై సష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికి నాలుగు విడుతలుగా రుణమాఫీ చేసినా.. ఇంకా రెండు లక్షలలోపు రైతులు చాలా మంది మిగిలిఉన్నారు. కొన్ని గ్రామాల్లో వందలాది మందికి మాఫీ కాలేదు. దీంతో సదరు రైతులు అధికారులకు అర్జీలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మిగిలిపోయిన రైతులకు మరో దఫా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.. లేదా..? అన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భవిష్యత్‌లో 2 లక్షలపై రుణం తీసుకున్న రైతులకు సైతం 2 లక్షల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విషయం తెలిసిందే. కానీ, వీరికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలులేవు. ఈ నేపథ్యంలో వీరికి మాఫీ ఉంటుందా.. లేదా..? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నేను చొప్పదండి కేడీసీసీ బ్యాంకులో లక్షా 90వేలు, యూనియన్ బ్యాంకులో లక్షా 60వేలు క్రాప్‌లోన్ తీసుకున్న. అవి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలలోపు పంట రుణం మాఫీ చేస్తామంటే ఆశలు పెట్టుకున్నం. నేను అప్పు తెచ్చి యూనియన్ బ్యాంకులో ఉన్న లక్షా 60 వేలు కట్టిన. నాలుగు విడుతలుగా రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మిగతా కేడీసీసీ బ్యాంకులో ఉన్న లక్షా 90వేలు మాఫీ చేయలేదు. అప్పు తెచ్చిన కట్టిన డబ్బులకు మిత్తిలే ఎకువగా అవుతున్నయి. రైతులను మభ్యపెట్టి ఇలా మోసం చేయడం బాధగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదాలు పెట్టకుండా రుణమాఫీ తక్షణమే చేయాలి. లేకుంటే రైతులందరం ఆందోళనలు చేస్తం.
– కళ్లెం లక్ష్మారెడ్డి, రైతు (చొప్పదండి)
నాకు మద్దుట్ల శివారులో తొమ్మిదెకరాల భూమి ఉన్నది. ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం చేస్త. మా ఊరి పక్కనే రామన్నపేటలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయల పంట రుణం తీసుకున్న. అయితే నాకు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేని కారణంగా అధికారులు చెప్పినట్టు మల్యాల రైతు వేదిక వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ చేయించి, ఫొటోలు దిగి వచ్చిన. వారం క్రితం రుణమాఫీ అయినటుట్ట వ్యవసాయ శాఖ అధికారులు జాబితా విడుదల చేశారు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రభుత్వం తరఫున వచ్చే నగదు జమ కాలేదని చెప్పారు. కొత్త రుణం కావాలంటే మాఫీ నగదు ఖాతాలో జమ అయితేనే, మళ్లీ రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నరు.
– బోయినపల్లి విజయలక్ష్మి, మద్దుట్ల (మల్యాల మండలం)
నేను చొప్పదండి యూనియన్ బ్యాంకులో లక్ష క్రాప్ లోన్ తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటే సంబురపడ్డ. మొదటి విడుతలో మాఫీ అయితది అనుకున్న. కాలేదు. సెకండ్ లిస్ట్‌లో వస్తదని ఆశపడితే అందులో కూడా రాలేదు. ఇప్పుడు మూడు, నాలుగు లిస్టులు కూడా అయిపోయినయి. నాకే కాదు, మా తమ్ముడికి కూడా లక్ష మాఫీ కాలేదు. ఇంకా మాలాంటి పేద రైతులు చాలామందే ఉన్నరు. కాంగ్రెస్ రైతులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నది. ఎన్నికల్ల దొంగ హామీలు ఇచ్చి, ఇప్పుడు చెలగాటం ఆడుతున్నది. ఇలా చేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వెంటనే రుణమాఫీ చేయాలి.
-మరిమడ్ల సురేశ్, రైతు (చొప్పదండి)
నాకు మా ఊరు రామన్నపేట పక్కన మద్దుట్ల గ్రామ రెవెన్యూ శివారులో నాలుగెకరాల 27 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. దాన్ని సాగు చేస్తున్న. స్వల్పకాలిక పంట రుణం కింద నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో లక్షా 50వేలు తీసుకున్న. నాకు మొదటి, రెండో విడుతలో రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయ్యేందుకు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ కోసం వ్యవసాయ శాఖ అధికారి వద్దకు వెళ్లి సైతం ఫొటోలను దిగిన. ఈ క్రమంలోనే ప్రజా పాలన సంబురాల్లో భాగంగా రుణమాఫీ జాబితాలో మా పేరు వచ్చింది. నూతనంగా రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే నా ఖాతాలో రుణమాఫీ మొత్తం జమ కాలేదని బ్యాంకు ప్రతినిధులు చెప్పిన్రు. నిరాశతో తిరిగివచ్చిన. నాయకులు ఏమో వందశాతం రుణమాఫీ అయిందంటున్నరు. నాకు రుణమాఫీ అయిందా.. కాలేదా..? ప్రభుత్వ పెద్దలు స్పష్టతనివ్వాలి.
– ఐలాపురం తిరుపతి, రామన్నపేట (మల్యాల మండలం)
