పాలకుర్తి, జూన్ 9 : రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి, తీవ్ర గాయంతో తల్లడిల్లుతున్నది. గ్రేడేడ్ స్పైనల్ కార్డ్‌కు గాయం కావడంతో చికిత్సకు డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తున్నది. మానవతావాదులు స్పందించి తనకు కొత్త జీవితం ఇవ్వాలని వేడుకుంటున్నది. వివరాల ప్రకారం.. ఈ నెల5న బసంత్‌నగర్‌కు చెందిన గుంటిపెల్లి రాము, తన భార్య అనూష (26), నాలుగేళ్ల కూతురు సహస్రతో కలిసి బైక్‌పై హూస్నాబాద్‌లో జరుగనున్న తన బామ్మర్ది (భార్య తమ్ముడు) పెళ్లికి వెళ్తుండగా, సుల్తానాబాద్ సుగ్లాంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి రాంగ్‌రూట్‌లోకి వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి సహస్ర తీవ్రగాయాలపాలైంది.
మొదట సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు నానమ్మ, బంధువులు చికిత్స చేయిస్తున్నారు. అయితే, సహస్ర గ్రేడేడ్ స్పైనల్ కార్డ్‌కు తీవ్ర గాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీనికి సుమారు 10 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో నానమ్మ ఆందోళన చెందుతున్నది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమని, మానవతావాదులు స్పందించి చిన్నారిని బతికించాలని వేడుకుంటున్నది. తల్లిదండ్రులను కోల్పోయి ఐసీయూలో పోరాడుతున్న చిన్నారికి కొత్త జీవితం ప్రసాదించాలని కోరుతున్నది. దయార్ద్ర హృదయులు సాయం (9492981030) ఫోన్ పే చేయాలని విన్నవిస్తున్నది.