మానకొండూర్ రూరల్, జులై 7 : పదవులు శాశ్వతం కాదనీ, రాజకీయంగా ప్రతి ఒక్కరూ పోటీలో ఉండాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. ఎన్నికలకు ముం దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా లో ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఆదివారం మానకొండూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని తాము అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
పార్టీలో ఉన్నవారందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌కు సైతం సూచించినట్లు గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామనీ, కేసీఆర్ నాయకత్వాన ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు వస్తే మహిళలకు అవకాశాలు వస్తాయని, ఇప్పుడు తాము తయారు చేసిన నాయకత్వంతో అవకాశాలను అందిపుచ్చుకుంటారని మహిళలకు సూచించారు. తాము ప్రతి పక్షంలో ఉన్నా నిద్రపోమని, బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తామని స్పష్టం చేశారు.
ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ ప్రాంతీయ పార్టీల సంకనే చేరారని వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆ ప్రాంతీయ పార్టీల నాయకులైన పవన్, చిరంజీవి వద్దకు వచ్చి చేయి కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు పులిలా ఉన్న మోదీ నేడు పిల్లిలా తయారయ్యారని తెలిపారు. ప్రాంతీ య భాషల మనుగడను దెబ్బ తీసేలా కొత్త చట్టాలకు హిందీ భాషను అనుసంధానం చేస్తున్నారని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఉమ్మడి సమస్యల విషయమై భేటీ అయ్యి ఏం సాధించారని ప్రశ్నించారు. కమిటీ వేశామని అంటున్నారని, అలాంటి కమిటీలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేయలేదా? అని గుర్తు చేశారు.
“రాష్ట్రంలో బీఆర్ఎస్ నక్కలా కాచుకొని ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటున్నారు.. బిడ్డా.. నక్కలా కాదు.. పులిలా ఉన్నాం” అని వినోద్ కుమార్ హెచ్చరించారు. భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో పని చేయాలని నాయకులను కోరారు. అనంతరం పదవులు పూర్తి చేసుకున్న జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు మెమోంటోలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్‌కుమార్; మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, వైస్ చైర్మన్ గోపాల్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రూప్సింగ్, బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, వివిధ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
పదవీ విరమణ పొందుతున్న ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు రానున్న రోజుల్లో మంచి పదవులను ఆశించాలి. పార్టీ కోసం నాయకులు పని చేయాలి. ప్రజలు ఎక్కువగా పనులు చేయించుకునేందుకు ప్రతి పక్షాల దగ్గరకే వస్తారు. ఇలాంటి పనులు చేస్తున్న సందర్భాల్లో కేడర్‌కు అనేక సమస్యలు వస్తాయి. వారికి అండగా నిలవాలి. నీళ్లు లేక అనేక డ్యాములు ఎండిపోయాయి. రైతులు అవస్థలు పడుతున్నారు. వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. యువతకు పెద్దపీట వేస్తాం. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్‌కు ఇష్టం. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి. ప్రజలకు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేస్తున్నది. ఆనాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఆడిన నాటకాన్నే నేడు కాంగ్రెస్ చేస్తున్నది. ఒక్కరు పోతే పార్టీ ఎప్పుడూ డీలా కాదు. ప్రజల వెంబడి ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించదు. కుల గణన, జన గణన అంటూ దాటవేస్తున్నది. పదవులకు మాత్రమే వీడ్కోలు కానీ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
గాలికి గడ్డి పోచలే పోతాయి.. కానీ, గడ్డపారలాంటి కార్యకర్తలు పోరు. బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాం. పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు పోతారు. వాళ్లు పోతేనేం గడ్డపారలాంటి కార్యకర్తలను తయారు చేసుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పని చేయాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు