హుజూరాబాద్‌టౌన్ మార్చి11: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్ ఎన్నికల హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నియోజకవర్గం నుంచి 25 వేలకు పైగా మందిని తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విద్యార్థులు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ పోరాటం చేస్తాయన్నారు. ఈసారి జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక అయిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పాలనలో ఎంపీ బండి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్రావు తదితరులున్నారు.