గంగాధర, మార్చి 19: రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Sunke Ravi Shankar) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల ఊసే లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. తులం బంగారాన్ని తుంగలో తొక్కారని, మహాలక్ష్మిని మర్చిపోయే విధంగా బడ్జెట్ ఉందన్నారు.
వ్యవసాయ రంగాన్ని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉంటుందనుకుంటే, ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. కార్యకర్తలకు ఫలహారం పంచినట్టుగా పంచుతామని రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.