హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు భారీగా పెరుగబోతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సులు మరింత ఖరీదైనవి కాబోతున్నాయి. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల జేబులకు చిల్లులు పడబోతున్నాయి. ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజులకు కోతపెట్టిన సర్కార్.. మిగతా కోర్సుల ఫీజులను భారీగా పెంచబోతున్నది. 2025-28 (మూడు విద్యాసంవత్సరాల) ట్యూషన్ ఫీజుల ఫైల్ ప్రస్తుతం సర్కార్ పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదమే తరువాయి అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఇదే జరిగితే ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు అమాంతం పెరుగనున్నాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫారసు ల ఆధారంగా ఫీజులను ఖరారుచేయనున్నది.
పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నది. ఉన్నత చదువులు చదువుకుందామనుకున్న వారి ఆశలను అడియాశలు చేస్తున్నది. రీయింబర్స్మెంట్ కింద అందిస్తున్న మొత్తాన్ని సర్కార్ పెంచడం లేదు. కానీ మరోవైపు ఇంజినీరింగ్, పార్మసీ, ఎంబీఏ వంటి కోర్సుల ఫీజులను మాత్రం అమాంతం పెంచుతున్నది. అటు నయా పైసా అదనంగా ఇవ్వకపోగా, మరోవైపు ఫీజుల మోత మోగిస్తున్నది. ఎడాపెడా పెంచి సర్కార్ చేతులు దులుపుకుంటున్నది. ఫలితంగా ఈ భారం తల్లిదండ్రులపై పడుతున్నది. రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా సర్కార్ విడుదల చేయడంలేదు. ఈ విద్యాసంవత్సరంతో కలిపితే బకాయిల మొత్తం రూ. 12,500 కోట్లు అవుతుంది.
బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద సర్కార్ కేవలం రూ. 35వేలు మాత్రమే ఇస్తున్నది. మిగిలిన మొత్తాన్ని విద్యార్థి జేబులో నుంచి చెల్లించుకోవాల్సిందే. ఉదాహరణకు రూ. లక్ష ఫీజున్న కాలేజీల్లో విద్యార్థి చేరితే సర్కార్ రూ. 35వేలు ఇవ్వనుండగా, విద్యార్థి సొంతంగా రూ. 65వేలు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎంబీఏ కోర్సులో చేరే బీసీ విద్యార్థి 1.23లక్షల ఫీజున్న కాలేజీలో సీటు వస్తే.. రూ. 88వేలు అదనంగా కట్టాల్సిన పరిస్థితులున్నాయి. బీసీ విద్యార్థులకు ఇచ్చే రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.