– జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప
హుజూర్నగర్, జూలై 25 : నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని, చట్టం ఎవరికి చుట్టము కాదని హుజూర్నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు అందులో పౌరుల హక్కులు విధుల గురించి పేర్కొనబడుతుందని, ఆ చట్టంలో ఉండే అన్ని విషయాలు పౌరులకు తెలిసినట్లుగానే భావించాలని కూడా చట్టంలో పొందుపరచబడి ఉంటుందని, అందువల్ల ఇది నేరం అని తెలియక తాము తప్పు చేశాం అంటే చట్టం మౌనంగా ఉండజాలదన్నారు. విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్ వినియోగానికి డ్రగ్స్ ను కలిగి ఉండటానికి దూరంగా ఉండాలని అలాగే సాంకేతికతను సన్మార్గానికి వినియోగించాలే తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించినట్లయితే శిక్షించబడతారన్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష, మరణ శిక్ష సైతం విధించే అవకాశం ఉన్న పోక్సో, నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని, అందువల్ల విద్యార్థులు నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు.
ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరుకోవడానికి కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు. యువత మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుందని హెచ్చరించారు. కళాశాలలలో, విద్యా సంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని, అందువల్ల ఏ ఒక్కరు ర్యాగింగ్ కు పాల్పడ వద్దని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సోమపంగు రామారావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ వి రమణారెడ్డి, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, నాగేష్ రాథోడ్, కుక్కడపు సైదులు, సైదా హుస్సేన్, ఉదారి యాదగిరి, శంకర్ నాయక్, శివకృష్ణ యాదవ్, గోపీనాథ్, మహిళా న్యాయవాదులు తెప్పని శ్రీలక్ష్మి, జుట్టుకొండ సంధ్య, స్థానిక ఎస్ఐ హనుమా నాయక్, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.