న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): అది ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సరార్ జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చి, చొకాలు విప్పేసి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని విమర్శించారు.
దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సమ్మిట్ బోర్డ్ ముందు నిలిచి నిరసనలు తెలిపారు. ‘పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అన్న నినాదాలతో హోరెత్తించారు. భద్రతా సిబ్బంది వెంటనే అకడికి చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించారు. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఇదే ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం.. బ్రహ్మాండం అనేలా కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాలు సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్‌రూమ్’ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లోనూ వార్‌రూమ్ నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఒకే వేదిక వద్ద శుక్రవారం జరిగిన ఈ రెండు సందర్భాలు రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నారో మరోసారి తెలియజెప్పాయి. ఏఐ సమ్మిట్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎలాగూ ఈ సదస్సుకు హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా అదే వేదిక మీది నుంచి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సమ్మిట్‌ను రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తున్నారనే ఆలోచనే లేకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం.. బ్రహ్మాండం అనేలా కొనియాడారు.
ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై రేకెత్తుతున్న ఆందోళనలను రేవంత్‌రెడ్డి కొట్టిపారేశారు. అదేమంత పెద్ద సమస్య కాదని, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చుగానీ సరైన రీ-సిల్లింగ్, అప్-సిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించే కొత్త అవకాశాలు మరింత విసృ్తతంగా ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో ‘ఏఐ వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరును అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ సదస్సును అడ్డుకొని దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని మండిపడ్డారు. దీనికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రమే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.‘ఐఎన్‌సీ అనేది వాస్తవానికి ఏఎన్సీ అని అంటే యాంటీ నేషనల్ కాంగ్రెస్, ఆందోళన చేస్తున్నవారికి షర్టులే కాదు వ్యక్తిత్వం కూడా లేదు’ అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు.
యూత్ కాంగ్రెస్ నేతలు ఒకవైపు అధికార బీజేపీ నేతల మీద ప్రతి విమర్శలు చేస్తూనే మరోవైపు రేవంత్‌రెడ్డికి తలంటుతున్నారు. జాతీయ కాంగ్రెస్ విధానం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ సీఎంగా రేవంత్ వేదిక మీద ప్రసంగించింది ఏమిటీ? అని వారు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మీద తమ అధినేత రాహుల్‌గాంధీ కంటే పక్కన ఉన్న చంద్రబాబు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నదంటూ పేరు చెప్పటానికి ఇష్టపడని యూత్ కాంగ్రెస్ నేత ఒకరు మీడియాతో అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు తీశారని మండిపడుతున్నారు.