Sleeplessness | నిద్రలేమి ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక స్క్రీన్ టైమ్తోపాటు ఆహారపు అలవాట్లు కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే కొన్ని ఆహారాలు శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ వంటి నిద్రను ప్రోత్సహించే హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడి మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో నిద్రపోయే ముందు వేడి పాలు తాగమని పెద్దలు చెప్పడం వెనుక కూడా ఇదే కారణం ఉంది. పాలలో ఉండే కొన్ని పోషకాలు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి నిద్రకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. పాలతో పాటు మరికొన్ని ఆహారాలు కూడా మంచి నిద్రకు దోహదపడతాయి. డార్క్ చాక్లెట్లో కెఫిన్ ఉన్నప్పటికీ, ఇందులో సెరటోనిన్ కూడా ఉంటుంది. సెరటోనిన్ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి సమయంలో ఎక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్ తీసుకుంటే అందులోని కెఫిన్ కొందరిలో నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.
పిస్తాలో ప్రోటీన్‌తోపాటు విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ ట్రిప్టోఫాన్‌ను సెరటోనిన్‌గా, తర్వాత మెలటోనిన్‌గా మారేందుకు సహాయపడుతుంది. మెలటోనిన్ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రించే హార్మోన్ కావడంతో మంచి నిద్రకు తోడ్పడుతుంది. అరటిపండులో పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి శరీరానికి విశ్రాంతి కలిగించడంలో సహాయపడతాయి. దీంతో నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది. చెర్రీ పండ్లలో సహజసిద్ధమైన మెలటోనిన్ ఉంటుంది. ఇది శరీరంలోని నిద్ర చక్రాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. నిద్రలేమి లేదా ప్రయాణాల వల్ల ఏర్పడే జెట్ ల్యాగ్ సమస్యలను తగ్గించడంలో కూడా చెర్రీలు ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పీనట్ బటర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ ట్రిప్టోఫాన్ ఉత్పత్తికి అవసరమైన అమినో ఆమ్లాలను అందిస్తుంది. ట్రిప్టోఫాన్ నుంచి సెరటోనిన్, ఆపై మెలటోనిన్ ఉత్పత్తి కావడంతో నిద్రకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అయితే పీనట్ బటర్‌ను పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.
టీ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. సాధారణ బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిలో కెఫిన్ ఉండటం వల్ల కొందరిలో నిద్రకు భంగం కలుగుతుంది. అయితే కెఫిన్ లేని హెర్బల్ టీలు, ముఖ్యంగా క్యామొమైల్, వలేరియన్, కావా వంటి మూలికలతో తయారైన టీలు శరీరాన్ని రిలాక్స్ చేసి మంచి నిద్రకు తోడ్పడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మంచి నిద్ర కోసం ఆహారంతో పటు క్రమబద్ధమైన నిద్ర సమయం, రాత్రి వేళల్లో కెఫిన్ పరిమితం చేయడం, పడుకునే ముందు మొబైల్ లేదా ఇతర స్క్రీన్ల వినియోగాన్ని తగ్గించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.