కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 3 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ ఏడాది పాలనలోనే పదేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. ఇది పూర్తిగా తుగ్లక్ పాలనగానే ఉందని ధ్వజమెత్తారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ రైతుబంధు ఇస్తే మూడు పంటలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన రేవంత్రెడ్డి ఇప్పుడు రైతులకు ఏడాది కాలంగా రైతుభరోసా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కనీసం రెండు పంటలకు కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఒక్కో రైతుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 20వేలకుపైగా బాకీ పడిందని విమర్శించారు. కౌలు రైతులకు, ఉపాధి కార్మికులకు ఏడాదికి 12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసాకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు.
సాగు చేస్తున్న వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు ఎందుకని మండిపడ్డారు. సంకాత్రికి ఇస్తామన్న రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని, మరోసారి వాయిదా వేయాలనుకునే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవుపలికారు. ఇప్పటికీ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కాంట్రాక్టు మంత్రుల జేబులు నింపుకోవడం తప్ప ప్రజా సమస్యలు, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణిచివేత, అరెస్టులు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీలేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, చొప్పదండి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.