గంగాధర, జనవరి 19: “కేసీఆర్ పాలనలో టైమ్‌కు నీళ్లచ్చినయ్.. ఆకాశం వైపు చూడకుండా పంటలు సాగు చేసినం.. టైమ్‌కు రైతుబంధు వ చ్చింది.. 24 గంటల కరెంటు ఉంది.. కష్టం లేకుం డా ఎరువులు దొరికినయ్.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం.. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా ఎగవెట్టిన్రు.. క రెంటు కోతలతో మోటర్లు కాలిపోతున్నయి.. పంట లు ఎండిపోతున్నయ్..” అంటూ గంగాధర మండలంలోని చెర్లపల్లి(ఎన్) గ్రామ రైతులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద చెర్లపల్లి(ఎన్) గ్రామ పరిధిలో నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడగా నాటి కేసీఆర్ పాలన.. నేటి రేవంత్‌రెడ్డి పాలన గురించి వారు మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్‌కు సకాలంలో ఎల్లంపల్లి జలాలను విడుదల చేయకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం క్రితమే నీటిని విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్యంకు క్షీరాభిషేకాలు చేశారని గుర్తు చేశారు. సరైన సమయంలో నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, పొట్టల కనకయ్య, పొన్నం రాములు, గర్వందుల పరశురాములు, వడ్లూరి ఆదిమల్లు, దోమకొండ మల్లయ్య, తదితరులు ఉన్నారు.