గంగాధర, మే 27: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వర్షం పడిన తర్వాత కేంద్రాల వద్దకు రావడం కాదని, ముందే కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. తేమశాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని, మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతో బస్తాలు వర్షానికి తడుస్తున్నాయని, కింద చెదలు పడుతున్నాయని వాపోయారు. యాభై రోజులైనా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని, గన్నీ సంచులు, టర్పాలిన్లు అందుబాటులో లేవని, లారీలు రాకపోవడంతో బస్తాలు మిల్లులకు తరలించే దిక్కులేదన్నారు. ఇప్పటికే రైతులు క్వింటాల్‌కు పది కిలోల చొప్పున దోపిడీకి గురయ్యారని, ఇప్పుడు అకాల వర్షంతో మరింత నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.