పెగడపల్లి, ఆగస్టు 2: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేక నేత కార్మికులు జీవనోపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో ఉపాధి లేక, జీవనోపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు గుండేటి మల్లేశం కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ చీరెల ఆర్డర్లతో నేత కార్మికుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపితే, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నారని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా నేత కార్మికులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించి, మృతి చెందిన నేత కార్మికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నామాపూర్‌లో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, పార్టీ నాయకులు ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, ఇనుకొండ మోహన్‌రెడ్డి, ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి, కోరుకంటి రాజేశ్వర్‌రావు, తిర్మణి నర్సింహారెడ్డి, నగావత్ తిరుపతినాయక్, బాబుస్వామి, పెద్ది సంతోష్, వెల్మ సత్యనారాయణరెడ్డి, గాండ్ల సత్తయ్య, నాగుల రాజశేఖర్‌గౌడ్, పలుమారు విజయ్‌యాదవ్, గోలి సంజీవరెడ్డి, జేరిపోతుల శ్రీనివాస్, అందె వెంకటేశం, కనకయ్య పాల్గొన్నారు.