కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై విచారించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆయనతోపాటు అప్పటి మంత్రులు టీ హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు పంపించారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ చర్యలకు పాల్పడ్డాయని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రైతులు సాగునీటి కోసం పడిన బాధలను చూసి కేసీఆర్ ఎంతగానో చలించి పోయారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు.
ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి అడ్డుపడ్డారని, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ ప్రజల్లో వచ్చిన ఖ్యాతిని, ఏర్పడిన గౌరవాన్ని రేవంత్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నదని, నోటీసుల ద్వారా కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ టెన్నల్ కూలిపోయి అనేక మంది కార్మికులు చనిపోయినా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కొప్పుల ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోతున్నదని, వాటిని మరిపించేందుకే ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని, వాటిలో ఒక్కదానిని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉన్నదని ధ్వజమెత్తారు. రాజోయే రోజుల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.