కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 20 : అన్ని ప్రాంతాలకు రైతులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలున్న చోటకు తరలించకపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భగ్గుమన్నారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని, తమ ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కాకతీయ కాలువ హెడ్రెగ్యులర్ను పగులగొైట్టయినా సరే పంటలు కాపాడుతామని, అందుకు వెనకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్సారెస్పీ సాగునీటి పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై మండిపడ్డారు. కాకతీయ కాలువ 116 కిలోమీటర్వద్ద ఉన్న హెడ్రెగ్యులర్ను కిందకి దింపి.. డీ 89 కాలువ ద్వారా నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. దీని వల్ల కరీంనగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే నీటిని దిగువకు అంటే.. అధికార పార్టీ మంత్రి, ఎమ్మెల్యేలున్న చోటకు పంపిస్తున్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని భగ్గుమన్నారు. ఇక ముందు వచ్చే నీటి విషయంలో సమన్యాయం పాటించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయని, అధికారులు శాశ్వతంగా ఉంటారన్నారు. కానీ, అధికారులే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల వల్లే అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చిందన్నారు. తనకు పోరాటాలు కొత్త కాదని, సమైక్య రాష్ట్రంలోనే తన నియోజకర్గానికి అన్యాయం జరిగితే.. తాగు, సాగునీటి కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకొని అధికారులు సమన్యాయం పాటించాలని సూచించారు.
తేరుకోకపోతే తాగునీటికి తండ్లాటే
ఎల్ఎండీలో ప్రస్తుతం ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఈ నెలాఖరు వరకు సాగు కోసం 3.5 టీఎంసీ నీటి విడుదల చేస్తున్నారని గంగుల చెప్పారు. డెడ్ స్టోరేజీ పోతే.. మిగిలిన నీటితో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సమీక్షించి, మధ్యమానేరు నుంచి నీటిని విడుదల చేసి, స్టోరేజీ పెంచాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీలో 12 టీఎంసీలకు తక్కువ ఉండకుండా చూడాలంటూ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజా పరిస్థితులను చూస్తే ఈ సారి వేసవిలో నగర వాసులకు నీటి కొరత ఏర్పడే ముప్పు ఉందన్నారు. నగరంలో మహిళలు నీటి కోసం బిందెలతో బయటకు వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సాగునీటి అందించే విషయంలో విఫలమైన ప్రభుత్వం, కనీసం తాగునీటి విషయంలోనైనా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
నగరంలో అభివృద్ధి పనులకు మున్సిపల్ అధికారులెవరూ రావడం లేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గంగుల కమలాకర్ చెప్పారు. శానిటేషన్ విభాగంలో పారిశుధ్య కార్మికులు అనారోగ్యం పాలయితే వారికి బదులుగా కుటుంబసభ్యులు కార్మికులుగా పని చేస్తారని, ఇది అందరికి తెలిసిందేనన్నారు. కానీ, ఇప్పుడు వారిని కూడా అధికారులు తొలగించారని, దీనిపై కూడా కలెక్టర్‌ను కలిసి వారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకూ వెంటపడుతామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చినప్పుడు తాము సంతోషిస్తామన్నారు.
బడ్జెట్లో బీసీలకు నిధుల కేటాయింపులో పూర్తిగా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఏటా 20వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోవడం లేదని ఆగ్రహించారు. బీసీ సమాజం ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు రాజేందర్రావు, బండారి వేణు, కంసాల శ్రీనివాస్, ఐలేందర్, మాజీ ఎంపీటీసీ తిరుపతినాయక్, నాయకులు సంపత్‌రావు, గందె మహేశ్, దూలం సంపత్, కోల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్లో జిల్లాకు గుండు సున్నా?
జిల్లాలో అధికార పార్టీ ఉన్నదా.. లేదా..? అన్న అనుమానాలు వస్తున్నాయని గంగుల విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన ప్రతి రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా పేరుతో నిధులు కేటాయింపు జరిగిందని, కానీ, తాజా బడ్జెట్లో ఏం కేటాయింపులు జరిగియో ఒకసారి గమనించాలని కోరారు. కరీంనగర్ రాష్ట్రంలో ఒక భాగం కాదా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే నిధులు రావా..? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తే కరీంనగర్‌కు ఒక్కటి కూడా ఇవ్వలేదని, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉంటే మంజూరు చేయారా..? అని అడిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో కరీంనగరానికి సీఎం అస్యూరెన్స్ కింద 350 కోట్ల్లు తెచ్చి అభివృద్ధి చేశామని, 2023 డిసెంబర్ వరకు ఈ పనులు కొనసాగాయని వివరించారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 14 నెలల నుంచి పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయాన్నారు. నిధులు తేవడం చేతకాకపోయినా సరే కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 350 కోట్లతో మిగిలిన పోయిన పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగిన కరీంనగర్‌ను.. కాంగ్రెస్ పాలనలో వెనకపడేసిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో మినీ కళాభారతికి శంకుస్థాపన చేసి వదిలేస్తే.. దానిని తన హయాంలో రద్దు చేయకుండా అదనంగా 13.50 కోట్లు మంజూరు చేయించి అమృతవర్షిణి పేరుతో పనులు చేపట్టామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పనులను సైతం పక్కన పడేస్తారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు తెరుచుకోని, వీధిదీపాలు వెలగని పరిస్థితి ప్రస్తుతం కరీంనగర్లో ఉందన్నారు.
మానేరు రివర్‌ఫ్రంట్‌పై ఎందుకీ వివక్ష
దక్షిణ భారత దేశంలోనే కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన మానేరురివర్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్యే మండిపడ్డారు. తాజా బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. 2021 జీవో నంబర్ 215 ద్వారా మానేరు రివర్ ఫ్రంట్‌కు 310 కోట్ల నిధులు తెచ్చి పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. మళ్లీ ఇరిగేషన్, మున్సిపల్ శాఖల నుంచి 214 కోట్లతోపాటు మరో వంద కోట్లు కూడా మున్సిపల్ శాఖ ద్వారా విడుదల చేయించి పనులు చేపట్టామని చెప్పారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసి.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వివక్షను పక్కన పెట్టి రివర్ ఫ్రంట్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.